దగ్గుబాటి రానా హీరోగా రూపొందుతున్న చిత్రం `విరాటపర్వం`. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి.. రానా సరసన నటిస్తుంది. ప్రియమణి, నవీన్‌చంద్ర కీలక పాత్ర పోషిస్తుంది. సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రం నుంచి నయా పోస్టర్‌ విడుదలైంది. నక్సల్‌ గెటప్‌లో ఉన్న రానాని పట్టుకుని సాయిపల్లవి వెళ్తుంది. ఈ కొత్త పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తించడంతోపాటు ఆకట్టుకుంది.

ఇందులో నక్సలైట్‌ అయిన రానాకి, ఆయన చేసే ఉద్యమానికి మద్దతిస్తూ, ఆయన్ని ప్రేమించే అమ్మాయిగా కనిపించనుందని తెలుస్తుంది. మాజీ నక్సలైట్‌ రవన్న(డాక్టర్ రవిశంకర్‌) జీవితం ఆధారంగా, 1990లో జరిగిన యదార్థ సంఘటన నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. `ఈ దేశం ముందు ఒక ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది.. సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది.. డాక్టర్‌ రవిశంకర్‌ అలియాస్‌ కామ్రేడ్‌ రవన్న..` అనే విషయాలను చూపించారు. తెలుగు నేల నడిచిన కొత్త దారుల నెత్తుటి జ్ఞాపకం.. మనలోంచి మన కోసం సాగిన ఓ చారిత్రక సందర్భం.. `విరాటపర్వం` అని దర్శకుడు వేణు పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చేయనున్నట్టు తెలిపారు.