ఆర్టిస్ట్ లు సమాజంలో ఐక్యత, సామరస్యం పెంపొందించాలి. విడగొట్టేలా మాట్లాడకూడదు. ప్రతి భాషకు గొప్ప చరిత్ర, సంస్కృతి ఉంటుంది. దాన్ని గౌరవించాలని హీరో రానా అన్నారు.
కమల్ హాసన్ కన్నడ, తమిళ భాషల గురించి చేసిన వ్యాఖ్యలపై రానా దగ్గుబాటి స్పందించారు. నటుల ముఖ్య పని ఎంటర్‌టైన్ చేయడమే తప్ప, సమాజం ఎలా బతకాలో చెప్పడం కాదన్నారు.
కమల్ హాసన్ కన్నడ వివాదం నేపథ్యం
`థగ్ లైఫ్` సినిమా ఆడియో వేడుకలో కమల్ హాసన్.. తమిళనాడు సంస్కృతి, భాషా ప్రత్యేకత గురించి మాట్లాడారు. కన్నడ లాంటి భాషలు తమిళం నుంచి ఉద్భవించాయన్నట్టుగా ఆయన మాట్లాడారని ఆరోపణలు వచ్చాయి. ఇది కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని విమర్శలు వెల్లువెత్తాయి. కర్ణాటకలో `థగ్ లైఫ్` సినిమా బ్యాన్ చేయడం వరకు వెళ్లింది.
కమల్ వివాదంపై రానా దగ్గుబాటి పరోక్ష స్పందన
"కళాకారులు సమాజం ఎలా బతకాలో చెప్పేవాళ్ళం కాదు. భాషా విధానాలు రూపొందించేవాళ్ళం కాదు. మా పని ప్రజల్ని అలరించడం. ఎవరు ఏ భాష మాట్లాడాలి, ఏ సంస్కృతి పాటించాలో మనం నిర్ణయించకూడదు" అని రానా అన్నారు.
"ఇప్పుడు ఉత్తర, దక్షిణ భారత సినిమా అనే తేడా లేదు. మనమంతా భారతీయ సినిమా అనే ఒకే వేదికపై ఉన్నాం. కథ బావుంటే ఏ భాషలోనైనా ఆదరిస్తారు. భాష ఒక మాధ్యమం మాత్రమే. కథ, చెప్పే విధానం ముఖ్యం" అని రానా అభిప్రాయపడ్డారు.
రానా తన మాటలకు ఉదాహరణగా, "మరాఠీకి చెందిన రజనీకాంత్ తమిళ సూపర్ స్టార్. కర్ణాటకకు చెందిన ప్రకాష్ రాజ్ దక్షిణాది, హిందీ భాషల్లో నటించారు. నేనూ అన్ని భాషల్లో నటిస్తున్నా. కళాకారులకు భాషా భేదం లేదు" అని వివరించారు.
"కళాకారులు సమాజంలో ఐక్యత, సామరస్యం పెంపొందించాలి. విభజన కలిగించేలా మాట్లాడకూడదు. ప్రతి భాషకు గొప్ప చరిత్ర, సంస్కృతి ఉంటుంది. దాన్ని గౌరవించాలి" అని రానా సూచించారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కమల్ కి రానా కౌంటర్ అదిరిపోయిందంటున్నారు నెటిజన్లు.
ఇక రానా ప్రస్తుతం తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి `రానా నాయుడు` సీజన్ 2 వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. దీని ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ నెల 13న నెట్ ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది.
