ఎల్లప్పుడూ ప్రజల నోళ్ళలో నానుతూ సంచలనంగా ఉండాలని కోరుకునే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం వంగవీటి నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. కోస్తా ఆంధ్ర రాజకీయాలలో, అదీ బెజవాడలో ఎవరూ మరిచిపోలేని నాయకుడు వంగవీటి మోహనరంగా కథ ఆధారంగా తీస్తున్న చిత్రం కావటంతో ఇది మొదటినుంచీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

 

కోస్తాలోని రెండు ప్రధాన కులాలకు సంబంధించిన సబ్జెక్ట్ అయినందున అంత సున్నితమైన అంశాన్ని వర్మ ఎలా డీల్ చేస్తాడా అని అందరిలో ఆసక్తి నెలకొంది. చిత్రం స్క్రిప్టు తయారీలో భాగంగా వర్మ రెండుసార్లు విజయవాడవెళ్ళి ఇరు వర్గాలనూ కలుసుకున్నారు. ఆయనకు దేవినేని సహకరించినప్పటికీ వంగవీటి కుటుంబం మాత్రం సానుకూలంగా స్పందించలేదు. దానికి కారణం వర్మ నిర్మాణంలో గతంలో రూపొందిన 'బెజవాడ' చిత్రంలో దేవినేని వర్గాన్నే హీరోగా చూపించటమేనని టాక్ వినబడింది.

ఎట్టకేలకు నిన్న ఈ చిత్రం విడుదలయింది. మితిమీరిన హింసాత్మకదృశ్యాలు తప్పిస్తే సినిమా బాగానే ఉందని అంటున్నారు. స్క్రీన్ ప్లే, ఫోటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్ బాగున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా కాస్టింగ్ - ముఖ్యమైన పాత్రలకోసం వర్మ ఎంచుకున్న నటులు, వారిని మేకోవర్ చేసిన విధానం బాగుందంటున్నారు.నాటి వాతావరణాన్ని బాగా సృష్టించాడని ప్రశంసలు కూడా వస్తున్నాయి. అయితే వర్మ వాయిస్ ఓవర్ పంటికింద రాయిలా అడ్డుపడుతోందని విమర్శలు వినబడుతున్నాయి.

 

మరోవైపు - 1972నుంచి 1988వరకు వరకు జరిగిన హత్యలను చూపించటం ఒక డాక్యుమెంటరీలాగా ఉంది తప్పిస్తే చరిత్రలోకి లోతుగా వెళ్ళలేదని విమర్శలు బలంగా వినబడుతున్నాయి. జరిగిన ఘటనలకు వర్మ న్యాయం చేయలేదని పెదవి విరుస్తున్నారు. అయితే వీటన్నంటినీ మించిన విమర్శ, రంగా పాత్ర చిత్రీకరణపై వ్యక్తమవుతోంది. దేవినేని గాంధి, నెహ్రూ పాత్రలను ఉదాత్తంగా ఉన్నతంగా చూపించిన వర్మ రంగా పాత్రనుమాత్రం ఆ స్థాయిలో చూపించలేదని అంటున్నారు.

 

పైగా రంగాను నెహ్రూ తల్లి రౌడీగా పేర్కొన్నట్లుకూడా ఒక సీన్ లో ఉంది. అంతర్లీనంగా దేవినేని వర్గాన్ని కథానాయకులగా, వంగవీటి వర్గాన్ని ప్రతినాయకులగా చూపినట్లు కనబడుతోంది. వర్మ చదివిన సిద్దార్థ కళాశాల(కమ్మ సామాజికవర్గంవారిది) నేపధ్యం, మొదటినుంచీ కమ్మవారితో అనుబంధం ఉండటం అతను దేవినేనివారి వైపే మొగ్గు చూపటానికి కారణమన్న వాదన బలంగా వినబడుతోంది.మరోవైపు రంగా పాత్ర చిత్రీకరణపై ఆయన సామాజికవర్గమైన కాపుకులంలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కాపు సామాజికవర్గంలో విశేష సంఖ్యలో ఉన్న రంగా అభిమానులు వర్మపై నిప్పులు చెరుగుతున్నారు... దుమ్మెత్తిపోస్తున్నారు. కాపు సామాజికవర్గంలో ఒక లెజెండ్ లాంటి వ్యక్తి అయిన రంగా సబ్జెక్ట్ కావటంతో కాపులు బాగా చూస్తారని, సినిమా బాగా నడుస్తుందని కనిపెట్టిన వర్మ, కాపు వ్యక్తితోనే పెట్టుబడి పెట్టించి(నిర్మాత దాసరి కిరణ్ కుమార్) సినిమా తీశాడని, కానీ దానిలో కాపులకు వ్యతిరేకంగా తీయటం దారుణమంటూ మండిపడుతున్నారు.

 

వర్మకు మొదటినుంచీ కాపులంటే వ్యతిరేకత ఉందని, అతను కాపుకులానికి చెందిన రత్న అనే అమ్మాయిని పెళ్ళి చేసుకుని వదిలిపెట్టేశాడని చెబుతున్నారు. దానికితోడు నాడు కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మరో నాయకుడైన సిరీస్ రాజును రంగా కొట్టటం కూడా వర్మకు కాపులమీద వ్యతిరేకతకు కారణమని అంటున్నారు.

 

తమ నాయకుడు రంగా రాబిన్ హుడ్ లాంటి వాడని, అతను కులాలకు అతీతంగా కమ్మవారితో సహా అన్నికులాలవారికీ సాయం చేశాడని చెబుతున్నారు. దేవినేని నెహ్రూ రంగాకు సమఉజ్జీయే కాదని అంటున్నారు. నాటి ప్రభుత్వమే రంగాను హత్యచేయించిందని ఆరోపిస్తున్నారు.

 

రంగా ప్రాణాలు తీయటంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించినవారందరూ దారుణంగా చనిపోయారని, వ్యాస్ ను నక్సలైట్లు కాల్చిచంపగా,  రంగాను స్పాట్ లో చంపిన చలసాని వెంకటేశ్వరరావు, దేవినేని రమణ కూడా అసాధారణగా మరణించారని గుర్తు చేస్తున్నారు. వంగవీటి చిత్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు.
 

ఇప్పటికే రంగా కుమారుడు రాధాకృష్ణ ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావును కలిసి ఈ సినిమాలో వాస్తవాల్ని వక్రీకరించారని, వర్మపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు సమర్పించారు. కొద్దిరోజులలో - డిసెంబర్ 26న - రంగా వర్ధంతి రాబోతుండటంతో ఆంధ్రలో ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయోననే ఉత్కంఠ నెలకొంది.

 

ఇదిలాఉంటే ముద్రగడ పద్మనాభంపై ప్రభుత్వం అణచివేత చర్యలతోనే తెలుగుదేశంపై గుర్రుగా ఉన్న కాపులను ఈ సినిమా మరింత రెచ్చగొట్టినట్లవుతుందని, తద్వారా తెలుగుదేశంపై కాపుల కోపాన్ని మరింత పెంచుతుందని వాదన వినబడుతోంది. మొత్తం మీద చూస్తే వర్మ ఈ వంగవీటి చిత్రంద్వారా తెలుగుదేశానికే ముప్పు తెచ్చిపెట్టినట్లు కనబడుతోంది.