Asianet News TeluguAsianet News Telugu

అకున్ సబర్వాల్ కు క్షమాపణ చెప్పిన రామ్ గోపాల్ వర్మ..కానీ..

  • డ్రగ్స్ కేస విచారణ తీరుపై వర్మ సంచలన కమెంట్స్
  • అకున్ సభర్వాల్ పై బాహుబలి 3 సినిమా తీయాలన్న వర్మ
  • వర్మ వ్యాఖ్యలను ఖండించిన ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్
  • తన ఉద్దేశం తప్పుడుది కాదని, బాధిస్తే క్షమించాలన్న వర్మ
ramgopal varma apologise akun sabharwal ips

అకున్ సబర్వాల్ ను కించ పరచాలనే ఉద్దేశం తనకు లేదని వర్మ అన్నారు. తన పోస్ట్ ల వల్ల ఏమైనా ఇబ్బంది అనిపించి వుంటే క్షమాపణ కోరుతున్నానన్నారు వర్మ. కేసులోని విషయాలు అకున్ కు బాగా తెలుసని అన్నారు వర్మ.

ఇంతకీ జరిగిందేంటి... గత నాలుగు రోజులుగా డ్రగ్స్ స్కాండల్ విచారణలో భాగంగా సిట్ టాలీవుడ్ ప్రముఖులను విచారిస్తోంది. ఇప్పటికే పూరీ జగన్, సుబ్బరాజు, శ్యామ్ కె నాయుడు, తరుణ్ తదితరుల  విచారణ పూర్తయింది. వీళ్ల వద్ద నుంచి వీలైనంత సమాచారం రాబట్టిన సిట్ విచారణ సజావుగా సాగుతోందని, వీరంతా విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని సిట్ కూడా స్పష్టం చేసింది. అయితే ఇదంతా గమనిస్తున్న చాలా మందికి గంటల కొద్ది విచారణ జరిగి చివరకు విచారణ సజావుగా సాగిందని చెప్పి వెళ్లిపోవడం అసహనానికి గురిచేసింది.

చాలా మంది సామాన్యుల్లా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా అసహనానికి గురయ్యారు. దీంతో ట్వీట్లకు, సోషల్ మీడియా పోస్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ దూరంగా ఉంటానని చెప్పిన వర్మ కంట్రోల్ తప్పాడు. డ్రగ్స్ కేసు విచారణ జరుగుతున్న తీరుపై అనుమానాలు వ్యక్తం చేశాడు. సినిమా వాళ్లపైనే గురిపెట్టడం సరికాదని వర్మ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. అంతటితో ఆగకుండా.. విచారణ జరుగుతున్న తీరు కేవలం ఎక్సైజ్ శాఖ తమ ఉనికిని చాటుకోవడానికి మాత్రమేనా అన్నట్లుగా వుందని విమర్శించారు. అంతే కాదు.. అకున్ సభర్వాల్ తో బాహుబలి 3 సినిమా కూడా తీయొచ్చని వర్మ ఘాటుగా వ్యాఖ్యానించారు.

వర్మ వ్యాఖ్యలపై భగ్గుమన్న ఎక్సైజ్ శాఖ మాజీ ఉద్యోగుల సంఘం.. వర్మ పై కేసు పెడతామని.. వర్మ కమెంట్స్ విచారణకు ఆటంకం కలిగించేలా వున్నాయని.. ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 50 ప్రకారం వర్మపై కేసుపెట్టి మూడేళ్ల వరకు బొక్కలో తోయొచ్చని పేర్కొంది. మరోవైపు ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ఆత్మ స్తైర్యం దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో వర్మ కమెంట్ చేయడం సరికాదు. విచారణ చట్ట ప్రకారం జరుగుతున్న సమయంలో ఆటంకం కలిగించేలా వ్యవహరించకూడదని హెచ్చరించారు ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్ర వదన్.

ఇక చంద్ర వదన్ వ్యాఖ్యలపైనా స్పందించారు వర్మ. ఒక వ్యవస్థలో పనిచేసే ఎంతో మంది కేవలం ఒక వ్యక్తి తన అభిప్రాయం చెప్తే ప్రభావితమవుతారంటే.. ఇక దేశాన్ని దేవుడే రక్షించాలని, అది కేవలం ఒక మనిషి అభిప్రాయం మాత్రమేనని... వ్యక్తి వల్ల వ్యవస్థ ఆత్మ స్తైర్యం దెబ్బతింటే ఇక అలాంటి వ్యవస్థ దేశానికి ఎందుకని వర్మ ప్రశ్నించారు. ఒక ఉన్నత స్థానంలో వున్న వ్యక్తి తన అభిప్రాయాలు చెప్తే వ్యవస్థ దెబ్బతింటుందంటే.. అంతకన్నా ప్రమాదం దేశానికి మరోటి వుందా..అంటూ వర్మ తనదైన శైలిలో స్పందించారు.

ఇక విచారణపై వర్మ కమెంట్స్ ను మా అధ్యక్షుడు శివాజీరాజా తీవ్రంగా ఖండించారు. విచారణ జరుగుతున్న తరుణంలో, పరిస్థితి చాలా సున్నితంగా ఉన్న నేపథ్యంలో అలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. అసలు సిట్ విచారణ గురించి మాట్లాడేందుకు వర్మ ఎవడని శివాజీరాజా ప్రశ్నించారు. అయితే తన అభిప్రాయం చెప్పే హక్కును ఎవరూ కాదనలేరని, ఇలాంటి వారి మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని వర్మ అన్నారు.

ఇక ఏదైనా అబిప్రాయం చెప్పే హక్కు ప్రతి ఒక్కరికి వుంటుందని, అయితే అది ప్రజాస్వామ్యంలో ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా వుంటే చాలని వర్మ చెప్పుకొచ్చారు. వ్యవస్థలన్నీ మనం పన్ను కడితే ఏర్పడ్డవేనని, మన కోసం పని చేసే వాళ్లను ఏమన్నా అనే హక్కు మనకుందని వర్మ అన్నారు. అసలు మోదీ కూడా నాకు నచ్చట్లేదు, ఇప్పుడు చెప్తున్నా... ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి అని వర్మ సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యంలో వున్నప్పుడు ఎవర్నీ ఏమీ అనొద్దు అంటే.. ఎలా..అని వ్యాఖ్యానించారు. తన కమెంట్స్ వల్ల విచారణకు ఆటంకం కలుగుతుందంటే తనకు సిగ్గుగా అనిపిస్తుందని వర్మ అన్నారు. తాను ఒక సామాన్యుడినని, తన కమెంట్స్ వల్ల మొత్తం వ్యవస్థ చచ్చుబడిపోతుందంటే ఎలా.. బాధ్యతగల్ల వ్యక్తులు అలా మాట్లాడటం సరికాదన్నారు. ఇక దేశంలో మీడియాలో వచ్చే ఊహాగానాలపై కోర్టులు ఎలా స్పందిస్తాయో తనకు తెలియదని వర్మ అన్నారు. దాని వల్ల నష్టం జరిగే వాళ్లకు తీవ్రంగా ప్రభావం పడుతోందని అన్నారు. అందుకే.. ఊహాగానాలు పెచ్చరిల్లకముందే వాస్తవాలు చెప్పేందుకు ఒక స్పోక్స్ పర్సన్ వుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు వర్మ. డ్రగ్స్ నిర్మూలనకు క్యాంపెయిన్ చేయాల్సిన అవసరముందన్నారు వర్మ.

Follow Us:
Download App:
  • android
  • ios