కొన్ని నెలలుగా మెగాభిమానులను ఊరిస్తున్న రామ్ చరణ్ రంగస్థలం టీజర్ రిలీజైంది. ఈ టీజర్ యూట్యూబ్ లో క్రేజీ విడియోగా మారి ట్రెండింగ్ లో టాప్ లో దూసుకుపోతోంది. ఈ టీజర్ లో ఫస్ట్ ఇంప్రెషన్ నుంచే ఎట్రాక్ట్ చేశాడు చెర్రీ. పక్కా పల్లెటూరి కుర్రోడు.. అందులోనూ చలాకీతనం, ఊళ్లో వాళ్లందరికీ చేదోడు వాదోడుగా ఉండే తత్వం.. అన్నీ కలగలిపితే రంగస్థలంలో రాంచరణ్ క్యారెక్టర్.

 

తాజాగా విడుదలైన రంగస్థలం టీజర్‌ మొత్తంగా మెగా అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ రాంచరణ్ ఇంటి ఎదుట సైతం టపాసులతో పండుగ చేసుకున్నారు. రంగస్థలం టీజర్ విడుదలైందో లేదో క్షణాల్లో వైరల్ గా మారింది. టీజర్ అద్భుతంగా ఉందని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

 

తమ సంతోషాన్ని చెర్రీతోనూ పంచుకోవాలని భావించిన ఫ్యాన్స్... ఆయన ఇంటి ముందు కూడా టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. చెర్రీ ఫ్యాన్స్ సంబరాలను ఆయన సతీమణి ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 'మా ఇంటి ముందు అభిమానులు ఇలా టపాసులు పేల్చారు. మీ అదరాభిమానాలకు ధన్యవాదాలు.' అంటూ ఆమె ట్విటర్ లో పేర్కొన్నారు.

 

ఇక అభిమానుల తాకిడితో చెర్రీ ఇంటి ముందు టపాసులు కాలుస్తున్న సమయంలో.. బాల్కనీ విండో నుంచి ఆయన అభిమానులకు అభివాదం చేశారు. టీజర్ ఎలా ఉందంటూ వారిని కనుక్కొన్నారు. చాలా బాగుందంటూ అభిమానులు కేకలు పెట్టడంతో వారందరికీ దన్యవాదాలు చెప్పి... సినిమా చూడండి అంటూ లోపలికి వెళ్లిపోయారు.

 

రంగస్థలం టీజర్ లో 'నా పేరు సిట్టిబాబండీ. ఈ ఊరికి మనమే ఇంజనీరు... అందరికీ సౌండ్‌ వినబడిద్దండి. కానీ నాకు మాత్రం సౌండ్‌ కనపడిద్దండి. అందుకే నన్ను సౌండ్‌ ఇంజినీర్‌ అంటారండి' అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ కూడా ఇప్పుడు ఫ్యాన్స్ తమ ఫ్రెండ్స్ తో తెగ డైలాగ్ కొట్టేస్తున్నారు.

 

రాంచరణ్-సుకుమార్ రంగస్థలం షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాంచరణ్ బోయపాటితో ఓ చిత్రం కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో కైరా అద్వానీ చెర్రీతో జత కట్టబోతోంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్‌ చిత్రంలోనూ చరణ్‌ నటించనున్నారు. ఇందులో చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటించనున్నారు.