రామ్‌ పోతినేని.. ఈ పేరు వింటేనే ఎనర్జిటిక్‌ స్టార్‌ అనే ట్యాగ్ లైన్‌ గుర్తొస్తుంది. అవును రామ్‌ అంతే ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఎప్పుడూ రెబ్‌బుల్‌ తాగిన మాదిరిగా ఎనర్జిటిక్‌గా ఉంటారు. సినిమాల్లోనూ ఆయనది అదే దూకుడు. సినీ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్‌ `దేవదాస్‌`తో హీరోగా కెరీర్‌ని ప్రారంభించారు. ఇది విడుదలై రేపటి(సోమవారం)తో 15ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. 

తొలి సినిమాతోనే హిట్‌ కొట్టాడు. వైవీఎస్‌ చౌదరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొంది ఆకట్టుకోవడంతోపాటు రామ్‌కి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. నయా `దేవదాస్‌` నుంచి ఇప్పుడు `రెడ్‌` చిత్రం వరకు రామ్‌ కెరీర్‌ ఆటుపోట్లతో సాగిందని చెప్పొచ్చు. పదిహేనేళ్ల కెరీర్‌లో ఆయన 19 సినిమాలు చేయగా, ఐదు సినిమాలు మాత్రమే విజయాన్ని సాధించాయి. కానీ ఏమాత్రం క్రేజ్‌, ఇమేజ్‌ తగ్గలేదు. సినిమా సినిమాకి తన రేంజ్‌ని పెంచుకుంటూ వస్తున్నాడు. 

వరుస పరాజయాల తర్వాత `నేను శైలజ` ఓ సారి నిలబెట్టగా, పూరీ దర్శకత్వంలో వచ్చిన `ఇస్మార్ట్ శంకర్‌` సాలిడ్‌ హిట్‌నిచ్చి వెనక్కి తిరిగి చూసుకోకుండా చేసింది. ప్రస్తుతం ఆయన `రెడ్‌` చిత్రంలో నటించారు. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదల కానుంది. ఇదిలా ఉంటే రామ్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సందర్భంగా `ర్యాపో 15ఇయర్స్ ఇన్ టీఎఫ్‌ఐ` పేరుతో ఓ స్పెషల్‌ సీడీపీని విడుదల చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.