అనందయ్యని జాతీయ నిధిగా గుర్తించి సైనిక సెక్యూరిటీ కల్పించాలిః రామ్‌గోపాల్ వర్మ ట్వీట్లు
శుక్రవారం ఆయుర్వేద మందు పంపిణీలో నెలకొన్న గందరగోళం దృష్ట్యా దీన్ని వారం రోజులపాటు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించారు.
నెల్లూరు జిల్లా, క్రిష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు బొగని ఆనందయ్య కరోనా మందు పంపిణీ వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఉపరాష్ట్రపతి సైతం ఆరా తీయడం, జాతీయ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఆయుర్వేద మందు పంపిణీలో నెలకొన్న గందరగోళం దృష్ట్యా దీన్ని వారం రోజులపాటు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
తాజాగా దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. తనదైన స్టయిల్‌లో సెటైర్లు వేశారు. వరుసగా ట్వీట్ల వర్షం కురిపించారు. ఫైజర్, మోడెర్నా వంటి మెడిసిన్ మాదిరిగా వారి మిశ్రమ నిష్పత్తిని పంచుకోని ఆనందయ్య ఫ్రీగా తన మందుని ఎందుకు పంపిణి చేస్తున్నారు. ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా? ఊరకనే అడుగున్నా` అంటూ ట్వీట్ చేశారు.
ఈ వివాదంలోకి అమెరికా అధ్యక్షుడిని లాగారు వర్మ. `జో బిడెన్, డాక్టర్‌ఫౌసీ కృష్ణ పట్నం కోసం ఎయిర్ ఫోర్స్ లో వెళ్తున్నారని విన్నాను. అయితే అతనితో కరోనా మందు విషయంలో ఒక ఒప్పందం జరపాలని కోరుతున్నా. అదే సమయంలో ఆనందయ్యని మాత్రం అపహరించవద్దని నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. ప్రస్తుతం ఆనందయ్యని జాతీయ నిధిగా ప్రకటించి అతనికి సైనిక భద్రత ఇవ్వకూడదా?` అంటూ తనదైన స్టయిల్‌లో ట్వీట్లు చేశారు వర్మ.