రామ్ గోపాల్ వర్మ చేసిన ఓ ట్వీట్ ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా నిలిచింది. హీరోల రెమ్యునరేషన్ విషయంలో ఆయన రెండు నాల్కల ధోరణి బట్టబయలయ్యింది.
ఆంద్రప్రదేశ్ లో సినిమా టికెట్స్ ధరలు తగ్గిస్తూ విడుదల చేసిన జీవో 35 పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ అధికార పార్టీ నేతలు సినీ ప్రముఖుల మధ్య చిన్నపాటి యుద్ధమే నడిచింది. సినిమా బడ్జెట్ లో యాభై శాతం స్టార్ హీరోల రెమ్యూనరేషన్ కే సరిపోతుండగా, వారు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే బడ్జెట్, అలాగే టికెట్స్ ధరలు తగ్గుతాయని వైసీపీ నేతలు కామెంట్స్ చేశారు. ఈ అభిప్రాయంపై రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) వ్యతిరేకత వ్యక్తం చేశారు. టికెట్స్ ధరలు తగ్గించినంత మాత్రాన హీరోల రెమ్యూనరేషన్ తగ్గవు అన్నారు.
ప్రేక్షకులు హీరో కోసమే సినిమా చూస్తారు. వాళ్లకున్న డిమాండ్ రీత్యా వాళ్ళు ఆ మేరకు తీసుకుంటున్నారు. కాబట్టి హీరోల రెమ్యూనరేషన్ కి బడ్జెట్ కి, టికెట్స్ ధరల తగ్గింపుకు సంబంధం లేదంటూ లెక్చర్లు ఇచ్చాడు. అంత వరకూ బాగానే ఉంది. కెజిఎఫ్ చాప్టర్ 2(KGF Chapter 2) విడుదలైన బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ మూవీ రికార్డు వసూళ్లు రాబడుతుంది. హిందీలో ఆల్ టైం హైయెస్ట్ ఓపెనర్ గా రికార్డులకు ఎక్కింది. తెలుగులో సైతం కెజిఎఫ్ చాప్టర్ 2 వసూళ్లు భారీగా ఉన్నాయి.
ఈ సినిమా సక్సెస్ ని ఉద్దేశిస్తూ రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. హీరోల రెమ్యూనరేషన్ రూపంలో డబ్బులు వేస్ట్ చేయకపోతే క్వాలిటీ సినిమాలు, బిగ్గెస్ట్ హిట్స్ దక్కుతాయని చెప్పడానికి కెజిఎఫ్ చాప్టర్ 2 సక్సెస్ నిదర్శనం అంటూ ట్వీట్ చేశారు. హీరో యష్ రెమ్యూనరేషన్ తక్కువ తీసుకోవడంతో మేకింగ్ కి ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టి క్వాలిటీ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించారని వర్మ తెలియజేస్తున్నారు.
అయితే ఏపీలో టికెట్స్ ధరల తగ్గింపు సమయంలో ఆయన చేసిన కామెంట్స్ కి, అభిప్రాయాలకు ఈ ట్వీట్ పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. అప్పట్లో ఏపీ అధికార నేతలు చేసిన కామెంట్స్ కూడా ఇవే. స్టార్ హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే క్వాలిటీ చిత్రాలు తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతాయి. కాబట్టి తక్కువ టికెట్ ధరకు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తాయన్న అభిప్రాయం వెల్లడించారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లాంటి ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తే.. ఆయనకు రూ. 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారు. త్రివిక్రమ్ లాంటి దర్శకుడు రూ. 20 కోట్లు తీసుకుంటారు. హీరోయిన్ తో పాటు ఇతర సాంకేతిక నిపుణులు, ఆర్టిస్ట్స్ కి మరో రూ. 10 కోట్లు. అంటే వంద కోట్ల బడ్జెట్ మూవీలో మేకింగ్ కి కేవలం రూ. 20 కోట్లు మాత్రమే వెచ్చిస్తున్నారన్న మాట. కనీసం సినిమా బడ్జెట్ లో మేకింగ్ కి 50 కోట్లు కేటాయించినా క్వాలిటీ వేరేలా ఉంటుంది.
కెజిఎఫ్ చాప్టర్ 2 సినిమా చూశాక ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)బడ్జెట్ పై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రూ. 150 కోట్ల బడ్జెట్ లోనే కెజిఎఫ్ 2 లాంటి క్వాలిటీ ఫిల్మ్ తెరకెక్కినప్పుడు, రూ. 600 కోట్లతో రాజమౌళి గొప్పగా ఏం చూపించారంటున్నారు. దీనికి సమాధానం ఎవరూ చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ రెమ్యూనరేషన్స్ గా చెరో రూ. 50 కోట్లు తీసుకున్నారు. ఇక రాజమౌళి రెమ్యూనరేషన్ వంద కోట్ల పైమాటే. అజయ్ దేవ్ గణ్, అలియాల కోసం మరో రూ. 20 కోట్లు.. ఇలా రెమ్యూనరేషన్స్ కే సినిమా బడ్జెట్ లో అధిక భాగం పోయింది.
