సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో వెన్నుపోటు ఎపిసోడ్, వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్ లను చూపించబోతున్నారు. అయితే ఈ ఒక్క బయోపిక్ తో ఆగనని అంటున్నాడు వర్మ.

త్వరలోనే మరో రెండు బయోపిక్స్ ను తీస్తానని ప్రకటించాడు. ఆ బయోపిక్స్ ఎవరివంటే కేసీఆర్, వైఎస్సార్. కేసీఆర్ కి సంబంధించిన ఇంకా రీసెర్చ్ మొదలుపెట్టలేదని చెప్పిన వర్మ వైఎస్సార్ బయోపిక్ పై మాత్రం వర్క్ జరుగుతుందని అన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వద్ద సినిమా మొదలుపెట్టి, ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాల మీద సినిమా తీయాలనుందని చెప్పాడు. అప్పట్లో ఆయన మరణ వార్త విని చాలా మంది సంతోషించారని, మరికొందరు బాధను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆయన మరణంతో మొత్తం రాజకీయాలే మారిపోయాయని అన్నారు.

ఇన్ని రకాలుగా ప్రభావితం చేసిన ఆయన నేపధ్యాన్ని తెరపై చూపించబోతున్నట్లు చెప్పారు. ఈ బయోపిక్ కి 'రెడ్డి గారు పోయారు' అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు వర్మ. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో ఇప్పుడే చెప్పలేనని అన్నారు.