మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత భారీగా తెరకెక్కుతున్న చిత్రం -సైరా నరసింహారెడ్డి. స్టైలిష్ డైరక్టర్  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ  సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లోని కోకాపేటలో భారీ సెట్స్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఆ మధ్య సెట్స్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం తెలిసిందే. దాన్ని త్వరగా పునరుద్ధరించి అందులో షూటింగ్ నిర్వహిస్తున్నారట. ఈ షెడ్యూల్‌తో సినిమా టాకీపార్ట్ పూర్తికానుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ కూడా జోరుగా జరుపుతున్నారు. 

ఇక షూటింగ్ పూర్తవుతున్న ఈ సమయంలో నిర్మాత రామ్ చరణ్ రిలీజ్ కు సంభందించిన స్పెషల్ ప్లాన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్ ని ఎలా చేస్తే బాగుంటుంది, ఏ స్దాయిలో చెయ్యాలి అనే దానిపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు.  అందులో భాగంగా ఓ టీజర్ ని రెడీ చేయిస్తున్నారు. టీజర్ ప్రోమోతో రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ ఇస్తారు. అలాగే టీజర్ రిలీజ్ కు సైతం స్పెషల్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బాహుబలి స్దాయి క్రేజ్ ని ఈ ప్రాజెక్టు కు తేవాలని తన టీమ్ కు ఖచ్చితమైన ఇనస్ట్రక్షన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

మరో ప్రక్క ఈ సినిమా విడుదల తేదీ ఖరారైందన్న వార్త వినిపిస్తోంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున సైరా థియేటర్లకు రావొచ్చన్న టాక్ వినిపిస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. 

రామ్‌చరణ్ నిర్మాతగా సైరా 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ సినిమా విడుదల చేయనున్నారు. తొలి తరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న సినిమా అత్యంత భారీస్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.