ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలంతా పాన్ ఇండియా లెవల్ లో మార్కెట్ పెంచుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా తెలుగు సినిమాకు మంచి గుర్తింపు ఏర్పడింది. టాలీవుడ్ నుంచి సినిమా రిలీజ్ అవుతోందంటే మంచి కథ ఉంటుందనే అభిప్రాయం ఏర్పడింది. ప్రభాస్, రానా నటించే చిత్రాలు నార్త్ లో కూడా విడుదలవుతున్నాయి. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మలయాళంలో మంచి మార్కెట్ ఉంది. ఆ దిశగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ప్రయత్నాలు ప్రారంభించాడు. రాంచరణ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం రంగస్థలం కన్నడలో అనువాదమై నేడు రిలీజవుతోంది. కర్ణాటక వ్యాప్తంగా రంగస్థలం చిత్రం 85 స్క్రీన్స్ లో విడుదలవుతుండడం విశేషం. 

ఇప్పటికే రాంచరణ్ తుఫాన్ చిత్రం ద్వారా చేసిన బాలీవుడ్ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కన్నడలో రాంచరణ్ అదృష్టం ఎలా ఉందో చూడాలి. మాయాబజార్ తర్వాత కన్నడలో డబ్ అయి విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రం రంగస్థలమే. 

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సమంత హీరోయిన్ గా నటించగా, జగపతి బాబు ప్రతినాయకుడిగా నటించాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.