‘నాటు నాటు’ ఆస్కార్ గెలిస్తే ఎలా ఫీల్ అవుతారు? దేశం గర్వించేలా బదులిచ్చిన రామ్ చరణ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan) అమెరికాలో ఆస్కార్స్ ప్రమోషన్స్ లో ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ABC స్టూడియోలో చిట్ చిట్ చేస్తూ.. ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా సినీలోకం ఎదురుచూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్స్ 2023 అవార్డుల ప్రదానోత్సవం మరికొద్దిరోజుల్లో అంగరంగ వైభవంగా జరగనుంది. Oscars awardsను దక్కించుకునేందుకు ఈసారి టాలీవుడ్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ఒరిజినల్ స్కోర్ విభాగంలో బరిలో నిలుచున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ నుంచి సెన్సేషనల్ హిట్ సాంగ్ అయిన ‘నాటు నాటు’ (Naatu Naatu) ఆస్కార్క్ కు నామినేట్ కూడా అయ్యింది. ఈ సందర్భంగా RRR తప్పకుండా ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకుంటుందని ఇండియన్ ఆడియెన్స్ ఆకాంక్షిస్తున్నారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ ‘ఆస్కార్స్’ ప్రమోషన్స్ కోసం అమెరికాలో ల్యాండ్ అయ్యారు. అమెరికన్ ఫేమస్ స్టూడియోస్ లో సందడి చేస్తున్నారు. నిన్న పాపులర్ అమెరికన్ టాక్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’లో చిట్ చాట్ చేసి ఆకట్టుకున్నారు. ఇక తాజాగా ABC (అమెరికన్ బ్రాండ్ కాస్టింగ్ కంపెనీ) స్టూడియోలో స్పెషల్ ఇంటర్వ్యూకూ హాజరయ్యారు. ఇంటర్వ్యూయర్ రీవ్ విల్ చరణ్ ను ఆస్తకరిమైన ప్రశ్నలతో.. ఆసక్తికరమైన సమాధానాలను రాబట్టారు. మరోవైపు చరణ్ కూడా ఇంట్రెస్టింగ్ గా బదులిస్తూ ఆకట్టుకున్నారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘నాటు నాటు’ సాంగ్ ను ఉక్రెయిన్ లోని ప్యాలస్ వద్ద 15 రోజుల పాటు షూటింగ్ చేశాం. అంతకన్నా ముందు వారంరోజుల పాటు రిహార్సల్స్ చేశాం. చాలా కష్టపడ్డాం. ఉక్రెయిన్ లోని ఆ ప్యాలస్ అద్భుతంగా అనిపించింది’ అని తెలిపారు... ఒకవేళ ‘నాటు నాటు’ ఆస్కార్స్ గెలిస్తే ఎలా ఫీల్ అవుతారు? అని అడిగిన ప్రశ్నకు ఒక్క క్షణం ఆగి.. ఆసక్తికరంగా స్పందించారు చరణ్.. ‘80 ఏండ్ల ఇండస్ట్రీలో తొలిసారిగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అందుకోవడం గొప్పవిషమే. ఇది ఒక్క తెలుగు వారికే సొంతం కాదు. ఇండియన్ సినిమా గర్వించే క్షణం అవుతుంది. మరోవైపు తను నమ్మలేని స్థితిలో ఉంటాన’ని చెప్పారు. అలాగే సినిమా అనేది ఒక ఎమోషన్.. కాబట్టి దేశం మొత్తానికి సంతోషానిస్తుందని.. నేనూ చాలా సంతోషిస్తానని తెలిపారు.
ఈఏడాది ఆస్కార్ ప్రదానోత్సవ వేడుకలను అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో గల ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో మార్చి 12, 2023న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ABC ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ ప్రాంతాలలో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఇక ఈవేడుకకోసం సినీ ప్రియులు, ప్రముఖులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఉద్యమ వీరుల పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.