సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్స్ తో ఈ సంక్రాంతి సాలిడ్ బిగినింగ్ దక్కించుకుంది. ఐతే కరోనా రాకతో ఈ ఏడాది ప్రేక్షకులకు సరైన సినిమా అనుభూతి కలిగించ కుండానే ముగియబోతుంది. ఓ టి టి లో సినిమాలు విడుదల అయ్యినప్పటికీ ప్రేక్షకులు మాత్రం థియేటర్ అనుభూతిని బాగా మిస్సవుతున్నారు. వచ్చే సంక్రాంతికి అయినా థియేటర్స్ ఓపెన్ అవుతాయని భావిస్తున్న మేకర్స్ ఆ విధంగా తమ చిత్రాల విడుదల షెడ్యూల్ చేసుకుంటున్నారు. 

2021 సంక్రాంతి బరిలో దిగుతున్నట్లు రవితేజ మరియు రామ్ ప్రకటించేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ క్రాక్. రవితేజ పోలీస్ రోల్ చేస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. విజయాల పరంగా వెనుకబడ్డ రవితేజ ఈ చిత్ర విజయంపై చాలా ఆశలే పెట్టుకున్నారు. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ మూవీని 2021 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. 

అలాగే హీరో రామ్ సైతం సంక్రాంతికి రానున్నట్లు తెలియజేశారు . గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ మూవీతో భారీ హిట్ అందుకున్న రామ్ ప్రస్తుతం రెడ్ మూవీ చేస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళ్ హిట్ మూవీ తాడం కి తెలుగు రీమేక్. రామ్ మొదటిసారి డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ పై మంచి అంచనాలున్నాయి. రెడ్ కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నాగ చైత్యన లవ్ స్టోరీ సైతం సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం కలదు.