కింగ్ నాగార్జున మరోసారి మన్మథుడిగా మారుతున్నాడు. దాదాపు 17 ఏళ్ల క్రితం విడుదలైన మన్మథుడు చిత్రం నాగార్జున కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ గా మన్మథుడు 2 వస్తోంది. రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇటీవల మన్మథుడు 2 చిత్రయూనిట్ పోర్చుగల్ లో కీలకమైన షెడ్యూల్ ని పూర్తి చేసుకుని వచ్చింది. త్వరలో హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్రారంభించనున్నారు. మన్మథుడు చిత్రంలో  నాగార్జున, సోనాలి బింద్రే మధ్య కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. మన్మథుడు 2లో రకుల్ నటిస్తుండడంతో ఆసక్తి నెలకొని ఉంది. తాజాగా చిత్రయూనిట్, నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ స్టిల్స్ ని రిలీజ్ చేశారు. 

ఓ ఫోటోలో నాగ్, రకుల్ రొమాంటిక్ ఫోజులో కనిపిస్తున్నారు. మరో ఫొటోలో నాగార్జున కెమిస్ట్రీ ల్యాబ్ లో ఏదో ప్రయోగం చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఇందులో కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఉండడం విశేషం. ఈ చిత్రాన్ని నాగార్జున, పి కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రావు రమేష్, సీనియర్ నటి లక్ష్మి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.