సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న `అన్నాత్తే` చిత్ర షూటింగ్‌ నిలిచిపోయింది. ఈ చిత్ర బృందంలోని ఎనిమిది మంది కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. దీంతో హుటాహుటిని చిత్ర షూటింగ్‌ని నిలిపివేశారు. అంతేకాదు ఇప్పుడు రజనీకాంత్‌ టెన్షన్‌లో పడ్డారు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు శివకుమార్‌ `అన్నాత్తే` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. కీర్తిసురేష్‌, నయనతార, ఖుష్బు, మీనా వంటి భారీ తారాగణం ఇందులో నటిస్తుంది. ఇటీవలే సినిమా షూటింగ్‌ని ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతుంది. యూనిట్‌లో కొంత మంది సిబ్బందికి అనారోగ్యానికి గురి కావడంతో కరోనా చేయించుకున్నారు. అందులో ఎనిమిది మంది క్రూకి పాజిటివ్‌ అని తేలింది. దీంతో వెంటనే షూటింగ్‌ ఆపేశారు. అంతేకాదు రజనీ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. 

ఈ వార్త రజనీ అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. మరోవైపు ఈ సినిమా షూటింగ్‌ని త్వరగా కంప్లీట్‌ చేసి రాజకీయాల్లోకి వెళ్లాలని రజనీ భావించారు. అందుకు ప్లాన్‌ కూడా రెడీ చేశారు. జనవరిలో పార్టీ పేరుని ప్రకటించబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇలాంటి అవాంతరం ఎదురుకావడం విచారకరం.