సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ రూపొందిస్తోన్న చిత్రం 'పేటా'. త్రిష, సిమ్రాన్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

ఇరవై మందిని పంపించాను.. చితక్కొట్టి తరిమాడు అంటూ వాయిస్ తో మొదలైన ఈ ట్రైలర్ లో 'వాడు కూర్చునే తీరుని బట్టే పసిగట్టగలం.. వాడు భయపడేవాడా..? కాదా..? అని.. వాడు మామూలోడు కాదు' అంటూ రజినీకాంత్ క్యారెక్టర్ గురించే చెప్పే ప్రయత్నం చేశారు.

'చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట' అంటూ రజినీకాంత్ పలికిన డైలాగ్ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. కథ ప్రకారం రజినీకాంత్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు.

అందులో ఒకటి హాస్టల్ వార్డెన్ పాత్ర కాగా, మరొకటి పల్లెటూరి వ్యక్తిగా పంచెకట్టులో కనిపిస్తున్నాడు. విజయ్ సేతుపతి, నవజుద్ధీన్ సిద్ధిఖీ, బాబీ సింహా వంటి నటులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.