సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న 'పేటా' సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఈరోజు రజినీకాంత్ పుట్టినరోజు కానుకగా సినిమా టీజర్ ని వదిలారు. రజినీకాంత్ తన మేనరిజంతో స్టైలిష్ గా నడుచుకుంటూ వచ్చే సీన్ తో టీజర్ మొదలైంది.

మాటలు లేకుండా కేవలం రజినీకాంత్ స్టైల్, లుక్స్ నే ప్రధానంగా చేసుకొని టీజర్ ని కట్ చేశారు. అభిమానులతో కలిసి తలైవా డాన్స్ చేయడం, అద్దం ముందు నిలబడి స్టైల్ గా కళ్లజోడు పెట్టుకుంటూ రజినీకాంత్ ఇచ్చిన స్మైల్ టీజర్ కి హైలైట్ గా నిలిచింది. 

అనిరుద్ నేపధ్య సంగీతం టీజర్ ని బాగా ఎలివేట్ చేసింది. కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సిమ్రాన్, త్రిషలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండగా, నవజుద్ధీన్ సిద్ధిఖీ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

టీజర్ ని బట్టి రజినీకాంత్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది.  సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.