సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆరోగ్యం కుదుట పడింది. ఆయన హై బీపీ నుంచి కోలుకున్నారు. నిన్న ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  వైద్యుల సూచనల మేరకు వారం రోజులపాటు పూర్తిగా బెడ్‌రెస్ట్ తీసుకోవాల్సి ఉంది. దీంతో తలైవా అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 

ఇదిలా తన అనారోగ్యం కారణంగా పార్టీ ప్రకటనలో మార్పులు చేసుకున్నారు రజనీ. త్వరలోనే ఆయన పార్టీని ప్రకటించబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 31న తన అభిమానులకు కొత్త సంవత్సర కానుకగా తన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయట. అంతకు ముందు పెద్ద సభ ద్వారా ప్రకటించాలని భావించారు. కానీ తన అనారోగ్యం రీత్యా వీడియో ద్వారా పార్టీని ప్రకటించాలనుకుంటున్నట్టు సమాచారం. 

అయితే డిసెంబర్‌ 31 రోజు పార్టీని అనౌన్స్ మెంట్‌ చేసే డేట్‌ని ప్రకటిస్తారా? లేక పార్టీ పేరునే ప్రకటిస్తారా? అనే విషయంలో స్పష్టత లేదు. తన పార్టీ సింబల్‌గా `ఆటో` అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. పార్టీ పేరు `మక్కల్‌ సేవై కట్చి` అనే పేరుని పరిశీలిస్తున్నారట. దాదాపు ఇది ఖరారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ప్రస్తుతం రజనీ `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నారు. శివ కుమార్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ టైమ్‌లో చిత్ర బృందంలో ఎనిమిది మందికి కరోనా సోకడంతో షూటింగ్‌ని నిలిపివేశారు. దీంతో ఆయన తిరిగి చెన్నై వెళ్లిపోవాలనుకున్నారు. ఇంతలో బ్లడ్‌ ప్రెజర్‌ పెరగడంతో హుటాహుటిని హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. మూడు రోజుల ట్రీట్‌ మెంట్‌ అనంతరం ఆదివారం ఆయన్ని డిశ్చార్జ్ చేశారు.