సూపర్ స్టార్ రజినీకాంత్ చకా చకా అన్నాత్తే షూటింగ్ పూర్తి చేశారు. కోవిడ్ సమయంలో కూడా కఠిన భద్రతా నియమాల మధ్య రజినీకాంత్ షూటింగ్ లో పాల్గొనడం విశేషం. కొన్నాళ్లుగా అన్నాత్తే షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. తాజా షెడ్యూల్ కొరకు రజినీకాంత్ హైదరాబాద్ రావడం జరిగింది. అన్నాత్తే మూవీలోని రజినీకాంత్ పార్ట్ షూటింగ్ ముగిసినట్లు సమాచారం. దీనితో రజినీకాంత్ హైదరాబాద్ నుండి చెన్నై తిరిగివెళ్ళారు. 


కాగా చెన్నైకి వెళ్లే ముందు రజినీకాంత్ తన మిత్రుడు మోహన్ బాబు నివాసానికి వెళ్లారు. మోహన్ బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను రజినీ కలవడం విశేషం. రజినీకాంత్ తో కలిసి దిగిన ఫోటో మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ గా మారింది. పరిశ్రమలో చాలా కాలంగా మోహన్ బాబు, రజినీకాంత్ మిత్రులుగా ఉన్నారు. 


యాక్షన్ ఎంటర్టైనర్ గా అన్నాత్తే చిత్రాన్ని దర్శకుడు శివ తెరకెక్కిస్తున్నాడు. శివ, రజినీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మొదటి చిత్రం అన్నాత్తే. మాస్ చిత్రాల దర్శకుడిగా మంచి పేరున్న శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. 


అన్నాత్తే చిత్రంలో మీనా, కుష్బూ, కీర్తి సురేష్ లతో పాటు జగపతి బాబు, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో అన్నాత్తే విడుదల కానుంది. మరోవైపు రజినీకాంత్ శాశ్వతంగా రాజకీయాలకు స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రజినీకాంత్ పోటీ చేయాలని భావించారు. అనూహ్యంగా రజినీకాంత్ రాజకీయాలలోకి రాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.