రజనీకాంత్‌.. స్టయిల్‌కి ప్రతిరూపం. మాస్‌ ఇమేజ్‌కి కేరాఫ్‌ అడ్రస్‌. బాక్సాఫీసు రికార్డులను మరో రూపం. డెబ్బై ఏండ్ల వయసులోనూ యంగ్‌ హీరోలకు పోటీ నిచ్చే ఎనర్జీ ఆయన సొంతం. బస్‌ కండక్టర్‌ నుంచి ఇండియన్‌ సూపర్‌ స్టార్‌గా ఎదిగిన వైనం నేటి తరానికి ఆదర్శం. తాజాగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 45ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. 

ఆయన నటించిన తొలి చిత్రం `అపూర్వ రాగంగల్‌` 1975 ఆగస్ట్ 15న విడుదలైంది. తన గురువు కె.బాలచందర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విశేష ఆదరణ పొందింది. కమల్‌ హాసన్‌ హీరోగా రూపొందిన ఈ సినిమాలో రజనీ ఓ చిన్నపాత్రలో మెరిశారు. తొలి చిత్రంతోనే రజనీ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. తనదైన మేనరిజంతోనూ మెప్పించారు. ఇక అప్పట్నుంచి తాను వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. 

అయితే.. రజనీకాంత్ నిజ జీవితంలో నల్లని రూపంలో ఉండే ఆయనను చూసి అప్పట్లో ఇతను హీరో ఏంటి అనుకున్నారు. ఎందుకంటే అప్పటివరకు అతనంటే ఎవ్వరికి తెలియదు. అందరిలాగానే ఇతను కూడా తిరుగు ముఖం పడతారని అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా కోలీవుడ్‌ని ఓ ఊపుఊపే రేంజ్‌కి వెళ్ళారు. తమిళ చిత్ర పరిశ్రమకే తలైవాగా మారిపోయాడు. తొలి సినిమాతోనే తన సత్తా ఏంటో చాటుకున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. తన దారి రహదారి అనిపించుకుంటున్నారు. ఎంత మందికొత్త హీరోలు వచ్చినా, ఆయన తర్వాతే అనేంత స్థాయికి చేరుకున్నారు.

ఈ నెల 15తో 45ఏళ్ల సుధీర్ఘ కెరీర్‌ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రజనీకాంత్‌ కామన్‌ డీపీని విడుదల చేశారు. అందులో ఆయన నటించిన సూపర్‌ హిట్‌ చిత్రాల ఫోటోస్‌ని హైలైట్‌ చేశారు. భాషా, శివాజీ, రోబో, కబాలి ప్రధానంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సీడీపీ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఆయన అభిమానులు దాన్నిట్రెండ్‌ చేస్తున్నారు.

ఇక ఈ ఏడాది `దర్బార్‌`తో మెరిసిన రజనీకాంత్‌ ప్రస్తుతం `అన్నాత్తై` చిత్రంలో నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. నయనతార, కీర్తిసురేష్‌, ఖుష్బు, మీనా వంటి భారీ తారాగనం నటిస్తుంది.