సెలబ్రిటీలు చేసే చిన్న చిన్న పోరపాట్లు కూడా భూతద్దంలో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా అభిమానులకు ఆదర్శంగా నిలవాల్సిన తారలు తప్పు చేస్తే అది చాలా పెద్ద విషయంగా భావిస్తుంటారు. తాజాగా సూపర్‌ స్టార్ రజనీకాంత్‌కు అలాంటి అనుభవమే ఎదురైంది. రజనీకాంత్‌ ఇటీవల కారు నడిపే సమయంలో సీటు బెల్టు పెట్టుకోకపోవటంతో ఆయనకు జరిమానా విధించారు చెన్నై ట్రాఫిక్‌ పోలీసులు.

జూన్‌ 26న చెన్నై నగరంలో కారులో ప్రయాణించిన రజనీకాంత్‌ ఆ సమయంలో సీటు బెల్టు ధరించలేదు. ఈ విషయం ట్రాఫిక్‌ పోలీస్‌ల కంటపడటంతో రజనీకాంత్‌కు జరిమానా విధించారు. వంద రూపాయల జరిమానా విధించగా అది ఇప్పటికీ పెండిగ్‌లోనే ఉంది. ఇటీవల రజనీకాంతో అధునాతన లాంబోర్గినీ కారును నడుపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

చెన్నైలోని ఇంటి నుంచి కెలంబాకంలోని తన ఫాంహౌస్‌కు రజనీకాంత్ కారులో ప్రయాణించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రయాణానికి సంబంధించి రజనీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాడా..? అవసరమైన పాసులు తీసుకున్నాడా..? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై రజనీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల దర్బార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాట్టే సినిమాల్లో నటిస్తున్నాడు.