సూపర్ స్టార్ రజనీకాంత్ అంటేనే భారీ సినిమాలకు పెట్టింది పేరు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ 2.0 చిత్రం తెరకెక్కుతోంది. మరో వైపు ఆయన పా రంజిత్ దర్శకత్వంలో చేస్తున్న 'కాలా' చిత్రం కొన్ని రోజుల్లో(ఏప్రిల్ 27) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈలోపే రజనీకాంత్ నెక్ట్స్ మూవీ ఖరారైంది. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన కూడా రావడం విశేషం.

 

సూపర్ హిట్ ఫిల్మ్ ‘పిజ్జా' చిత్రానికి దర్శకత్వం వహించిన కార్తీక్ సుబ్బరాజ్‌తో రజనీకాంత్ తన నెక్ట్స్ మూవీ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని సన్ నెట్వర్క్‌కు చెందిన ‘సన్ పిక్చర్స్' సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతోంది. గతంలో ఈ సంస్థ రజనీతో ‘యంతిరన్'(రోబో) చిత్రం తెరకెక్కించింది.

ప్రస్తుతం సినిమాను ఫార్మల్‌గా అనౌన్స్ చేశారు. త్వరలో పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ ఒక వినూత్న కథ చెప్పడంతో రజనీకాంత్ ఫిదా అయ్యారని, వెంటనే అతడితో సినిమా చేయడానికి ఓకే చెప్పారని తమిళ సినీ వర్గాల టాక్.

 

రజనీకాంత్ ఇటీవలే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. 2.0 మూవీ తర్వాత ఆయన పూర్తిస్థాయి క్రియాశీలక రాజకీయాల్లోకి ఎంటరవుతారని అంతా భావించారు. అయితే ఆయన అందరి అంచనాలు తారుమారు చేస్తూ మరో సినిమాకు కమిట్ కావడం హాట్ టాపిక్ అయింది.

 

ఇక రజనీకాంత్, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ 2.0 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గ్రాఫిక్స్ వర్క్ పూర్తికాక పోవడం వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. ఈ చిత్రం 2018 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది.