రాజశేఖర్ ప్రస్తుతం శేఖర్ చిత్రంలో నటిస్తున్నారు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
ఒకప్పుడు టాలీవుడ్ లో యాంగ్రీ హీరో రాజశేఖర్ తనదైన శైలిలో విజయాలతో దూసుకుపోయారు. ఆ తర్వాత కొంత కాలం పాటు రాజశేఖర్ కెరీర్ నెమ్మదించింది. ఆయన నటించిన చిత్రాలు నిరాశపరిచాయి. ఇక 2017లో విడుదలైన గరుడవేగ చిత్రంతో రాజశేఖర్ బౌన్స్ బ్యాక్ అయ్యారనే చెప్పాలి.
ప్రస్తుతం రాజశేఖర్ సెలెక్టివ్ గా కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. సినిమాకి సినిమాకి మధ్య గ్యాప్ తీసుకుని తనకు సెట్ అయ్యే కథలనే ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం రాజశేఖర్ నటిస్తున్న చిత్రం 'శేఖర్'. నేడు రాజశేఖర్ తన 60 వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు.
రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా శేఖర్ చిత్రం నుంచి కిన్నెర అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. రాజశేఖర్ సతీమణి జీవిత దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. సాంగ్ లాంచ్, తన పుట్టినరోజు సంధర్భంగా రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు.
'నాకు కోవిడ్ సోకినప్పుడు నేను బతుకుతానా లేదా అనిపించింది. నేను బతుకుతాననే నమ్మకం లేదు. ఎందుకంటే నేను హాస్పిటల్లో లేవలేక నడవలేక చాలా వరెస్టు స్విచ్వేషన్ లో ఉన్నాను. అయితే ఈ రోజు నేను మీ ముందు నిలుచున్నాను అంటే మీ అందరూ బ్లెస్సింగ్స్ కారణం అంటూ రాజశేఖర్ ఎమోషనల్ అయ్యారు.
నేను కోలుకున్న తరువాత ఈ "శేఖర్" సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాకు నేను ఎంత కష్టపడ్డాము అంటే..10 సినిమాలు చేసినంత కష్టం ఈ సినిమాకు కష్టపడ్డాను. అందరం ఈ సినిమాకు ప్రాణం పెట్టి తీశాము. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం జీవిత. తనే మా అందరినీ నడిపించింది అని రాజశేఖర్ తన సతీమణిపై ప్రశంసలు కురిపించారు.
