ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20న. ఆ రోజున ఆర్ ఆర్ ఆర్ నుంచి క్యారక్టర్ రివీల్ చేస్తూ ఓ టీజర్ వస్తుందని ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికీ ఆ టీజర్ కటింగ్ పూర్తి కాలేదని సినీ వర్గాల సమాచారం. అందుకే ఇప్పటిదాకా ఆ టీజర్ వస్తుందని ప్రకటన సైతం రాలేదు. రాజమౌళి, ఆయన టీమ్ రాత్రింబవళ్లూ ఆ టీజర్ పనిలోనే ఉన్నట్లు సమాచారం. అసలు కష్టం అంతా కావాల్సిన మేరకు ఫుటేజ్ లేకపోవటంతో వస్తోందని చెప్తున్నారు.అన్ని అనుకున్నట్లు జరిగితే మే 18 న ఈ టీజర్ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారు. 
 
మార్చి  27 న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా అల్లూరి సీతా రామ రాజు పాత్రకు సంభందించిన టీజర్ ని అనుకున్న టైమ్ కు పూర్తి చేసి విడుదల చేసారు. ఆ టీజర్ అదిరిపోయిందంటూ ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. అంతకు మించి ఎన్టీఆర్ టీజర్ ఉండాలని టీమ్ భావిస్తోంది. కానీ అందుకు తగినట్లు కొంత షూటింగ్ చేయాల్సి ఉందిట. కానీ లాక్ డౌన్ తో షూట్ చేయటం కుదర లేదు. టైమ్ దగ్గర పడుతోంది. ఉన్న మెటీరియల్ తోనే టీజర్ రిలీజ్ చేద్దామా అని రెండు,మూడు వెర్షన్స్ ఆల్రెడీ కట్ చేసారట. కానీ ఏది రాజమౌళికు పూర్తి సంతృప్తి ఇవ్వటం లేదట. మరి ఈ టీజర్ విషయంలో రాజమౌళి ఏం నిర్ణయం తీసుకుంటారో అంటున్నారు. ఎందుకంటే ఈ రిలీజ్ కాబోటే టీజర్ పై చాలా ఎక్సపెక్టేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి.

  'ఆర్ ఆర్ ఆర్' విషయానికి వస్తే.. ఈ సినిమా, ఇప్పటికే డబ్బై శాతం వరకూ చిత్రీకరణను జరుపుకుంది. లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన షూటింగు, లాక్ డౌన్ ఎత్తేసిన తరువాతనే తిరిగి ప్రారంభం కానుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 8 వ తేదీన విడుదల చేయనున్నట్టు కొంతకాలం క్రితమే ప్రకటించారు. అయితే ఆ రోజున ఈ సినిమాను విడుదల చేయలేమని ఓ  ఇంటర్వ్యూలో నిర్మాత డీవీవీ దానయ్య చెప్పారు. 

'జనవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే అనుకున్నాము, అయితే లాక్ డౌన్ కారణంగా ప్లానింగ్ దెబ్బతింది. ఇంకా చిత్రీకరించవలసిన సన్నివేశాలు వున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలే ఉన్నాయి.  అందువలన ముందుగా అనుకున్న సమయానికి ఈ సినిమాను విడుదల చేయలేము' అని చెప్పుకొచ్చారు. కాగా, వచ్చే సంవత్సరం  ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది.