మెగాస్టార్ చిరంజీవి కలల ప్రాజెక్ట్ గా తెరకెక్కిన సైరా చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలయింది. దక్షణాది భాషలతో పాటు,హిందీలో కూడా సైరాని పేద ఎత్తున విడుదల చేశారు. అన్ని ప్రాంతాల నుంచి సైరా చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 

స్వాతంత్ర సమరం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో చిరంజీవి నటనతో అదరగొట్టారు. నటీనటుల ఎమోషనల్ ఫెర్ఫామెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. సైరా విజయంపై సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా సైరా చిత్ర విజయంపై దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియాలో స్పందించారు. 

'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి గారు జీవించారు. చిరంజీవి గారి నటనతో మరుగున పడిన చరిత్ర మరోమారు ప్రకాశవంతంగా వెలిగినట్లైంది. జగపతి బాబు, కిచ్చా సుదీప్, తమన్నా, విజయ్ సేతుపతితో పాటు ఇతర పాత్రల్లో నటించిన నటీనటులంతా కథకు బలాన్ని చేకూర్చారు. 

నిర్మాతగా రాంచరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి పనితనం అద్భుతం. మీరంతా విజయానికి పూర్తి అర్హులు' అని రాజమౌళి ట్విట్టర్ లో సైరా చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.