టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం 'మన్మథుడు 2' సినిమాలో నటిస్తున్నాడు. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొందరు టీజర్ ని మెచ్చుకుంటుంటే.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. 

నాగార్జునకి ఈ వయసులో బోల్డ్ సీన్స్ అవసరమా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. రాహుల్ రవీంద్రన్ భార్య సింగర్ చిన్మయి గతంలో సీనియర్ హీరోలు తమకంటే వయసులో తక్కువైన నటీమణులతో రొమాన్స్ చేయడం ఇండియాలోనే జరుగుతుంటుందని మండిపడింది. 

ఇప్పుడు ఆ కామెంట్ ని తెరపైకి తీసుకొని చిన్మయిని సోషల్ మీడియాలో ఏకిపారేశారు. ఇంట్లో భర్తకి చెప్పలేవ్ కానీ నీకెందుకు ఇలాంటి స్టేట్మెంట్లు అంటూ మండిపడ్డారు. ఈ వివాదాలు చాలవన్నట్లు ఇప్పుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ పై కొందరు అభిమానులు ఫైర్ అయ్యారు. 'మన్మథుడు' టైటిల్ ని వాడుకోవడంపై కొందరు అక్కినేని అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

వేరే టైటిల్స్ దొరకవన్నట్లు క్లాసిక్ జోలికి ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరి ట్వీట్లు శృతిమించడంతో హర్ట్ అయిన రాహుల్ తన సహనాన్ని కోల్పోయాడు. 'నేనేదో ఆస్తులు తీసుకుంటున్నట్లు ఎందుకలా ఫీల్ అవుతున్నారో అర్ధం కావడం లేదని' అన్నారు. ఇంత ద్వేషం తగదని సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. ఆగస్ట్ 9న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి  సన్నాహాలు చేస్తున్నారు.