ఛేధించాలని ట్రై చేయద్దు(‘రహస్యం’రివ్యూ)
నలుగురు కుర్రాళ్లు, ఓ అమ్మాయి...వాళ్లంతా కలిసి ఓ అడవిలోకి వెళ్లటం అనే పాయింట్ తో అప్పట్లో తెగ సినిమాలు వచ్చాయి. అయితే ఆ ట్రెండ్ మారింది. హర్రర్ , హర్రర్ కామెడీలు మొదలయ్యాయి
--సూర్య ప్రకాష్ జోశ్యుల
నలుగురు కుర్రాళ్లు, ఓ అమ్మాయి...వాళ్లంతా కలిసి ఓ అడవిలోకి వెళ్లటం అనే పాయింట్ తో అప్పట్లో తెగ సినిమాలు వచ్చాయి. అయితే ఆ ట్రెండ్ మారింది. హర్రర్ , హర్రర్ కామెడీలు మొదలయ్యాయి. ఓ స్టార్ హీరోయిన్,కొందరు కామెడీ టీమ్ తో కానీ ఈ సినిమాలు తెరకెక్కిస్తూంటారు. అయితే ఈ సారి ఆ హీరోయిన్ కు పెట్టే ఖర్చు కూడా ఎందుకు అనుకున్నారో ఏమో కానీ కొందరు కొత్త వాళ్లను పోగేసి ...దెయ్యం సినిమా అంటూ మనకు పొగేసారు. పెద్దగా ఖర్చులేని వ్యవహారం కాబట్టి లాభ,నష్టాల గురించి పెద్దగా మాట్లాడునేందుకు ఏమీ ఉండదు. వచ్చిందా వచ్చింది. లేదా పోయిందేముంది అనిపిస్తుంది. అలాంటి ఓ సినిమానే ‘రహస్యం’.టైటిల్ కాస్త ఇంట్రస్ట్ గా అనిపించే ఈ సినిమా ఏదో కాలక్షేపానికి సరదాగా చుట్టేసిన సినిమానా లేక ...సీరియస్ గానే భయపడదామని చేసిన హర్రర్ ప్రయత్నమా రివ్యూలో చూద్దాం.
కథేంటి..
డైరక్షన్ ఛాన్స్ లు కోసం ట్రై చేస్తున్న రవి (శైలేష్)కు నిర్మాత రామ సత్యనారాయణ నుంచి పిలుపు వస్తుంది. నీ షార్ట్ ఫిలిం చూసి ఇంప్రెస్ అయ్యాను మంచి హర్రర్ కథ రాసుకుని రా అని ఆఫర్ ఇస్తాడు. అయితే హర్రర్ కథ రాయాలంటే కాస్తంత దెయ్యాలతో టచ్ ఉంటే మంచిదని, వాటి గురించి అన్వేషిస్తూ..ఓ మాంత్రికుడు (జబర్దస్త్ అప్పారావు) దగ్గరకు వెళ్తారు. అక్కడ వీళ్లను ఓ దెయ్యం దివ్య (రితిక) తగులుకుంటుంది. నీ సినిమాలో నన్ను హీరోయిన్ గా పెట్టి తీయి అని వెంటబడుతుంది. వేరే దారిలేక మొత్తానికి ఆ దెయ్యాన్ని పెట్టి సినిమా చేస్తాడు. ఇంతకీ దెయ్యానికి ఈ సినిమా హీరోయిన్ కావాలనే పిచ్చ ఏమిటి...రవి సినిమాలోనే నటిస్తానని ఎందుకు వెంటపడింది, ఆమె ప్లాష్ బ్యాక్ ఏమిటి, చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆ రహస్యం ఛేధించాల్సిందే.
ఎలా ఉంది..
దెయ్యానికి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండటం అనే కథను చూస్తూంటేై ఆ మధ్యన తమన్నా, ప్రభుదేవా కాంబినేషన్ లో వచ్చిన దేవి సినిమా గుర్తుకు రాకమానదు. అయితే ఆ సినిమా భారీ కాస్టింగ్ తో వచ్చింది. ఈ సినిమాలో ఎవరు హీరో, ఎవరు క్యారక్టర్ ఆర్టిస్ట్ లు అనే తేడా కూడా తెలియన సిట్యువేషన్ లో తయారైంది. అలాగే సినిమా కు ఏదో ఒక లైన్ అనుకుని ,సరిగ్గా స్కిప్టు రాసుకోకుండానే షూటింగ్ వెళ్లిపోయారనిపిస్తుంది. దాంతో అనవసరమైన సీన్స్ అడుగడుగడుక్కి తగులుతాయి. ఎక్కడా టెన్షన్ ఉండదు. ఉన్నంతలో హీరోయిన్ ప్లాష్ బ్యాక్ సీన్సే కాస్త నయం. కాస్తంత ఎమోషనల్ డెప్త్ తో ఉంటాయి. ముఖ్యంగా డైరక్టర్ కు స్క్రిప్ట్ పై అవగాహన లేకపోవటమో ఏమో కానీ రిపీట్ సీన్స్ అయితే కోకొల్లలు. ఇంతకి మించి ఈ సినిమాలో చెప్పుకోదగ్గ రహస్యాలు ఏమీ లేవు.
నటీనటులు, మిగతా డిపార్టమెంట్ లు..
హీరోగా నటించిన శైలేష్ లో మంచి నటుడు ఉన్నాడు. సానపడితే తెలుగుకు మంచి ఆర్టిస్ట్ దొరుకుతాడు. ఇక రితిక కూడా ఓకే..తన పరిధిలో తాను బాగానే మెప్పించింది. అద్బుతం ఆశించకపోతే ఫరవాలేదనిపిస్తుంది. మిగతావాళ్లు సోసో. ఈ సినిమా కు ఈ మాత్రం చాలు అన్నట్లు చేసుకుంటూ వెళ్లారు.
ఇక సినిమాలో సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఎడిటర్ ఈ సినిమాలో రిపీట్ సీన్స్ ని ఎడిట్ చేసినా ఓ అరగంట ప్రేక్షకుడుకి రిలీఫ్ దొరికేది. ఇక నిర్మాణ విలువలు విషయానికి వస్తే సోసోగా ఉన్నాయి.నటుడుగా రాణించిన శైలేష్... డైరక్టర్ గా సక్సెస్ కాలేదు.
ఫైనల్ థాట్
రామ సత్యనారయణ సినిమాలు చూడనివారికి ఇదేం సినిమారా అనిపిస్తుంది. ఆయన సినిమాలు పరిచయం ఉన్నవారికి స్టాండర్డ్స్ పెరిగాయే అనిపిస్తుంది.
రేటింగ్: 1/5
నటీనటులు : శైలేష్ , శ్రీ రితిక, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జబర్దస్త్ ఫేమ్ అప్పారావు తదితరులు.
దర్శకత్వం : సాగర్ శైలేష్
నిర్మాత : తుమ్మలపల్లి రామసత్యనారాయణ.
సంగీతం : కబీర్ రఫీ