దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కోడలు, ప్రకాష్ కోవెలమూడి భార్య కనిక బాలీవుడ్ లో స్క్రీన్ ప్లే రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ప్రకాష్ కోవెలమూడి డైరెక్ట్ చేసిన 'సైజ్ జీరో' సినిమాకి కూడా కథ అందించింది ఈమెనే..

ప్రస్తుతం ఆమె ప్రకాష్ కోవెలమూడి రూపొందిస్తోన్న బాలీవుడ్ సినిమాకి స్క్రీన్ ప్లే రాస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. షారుఖ్ ఖాన్ నటించిన 'జీరో' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా డివైడ్ టాక్ వస్తోంది.

క్రిటిక్స్ అందరూ కూడా ఈ సినిమాకి తక్కువ రేటింగులు ఇచ్చారు. సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కనిక వారిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

'జీరో' దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్, రచయిత హిమాన్షు శర్మ ఎప్పుడూ కొత్తదనం కోసమే ప్రయత్నిస్తారని వారి కాంబినేషన్ లో వచ్చిన 'తను వెడ్స్ మను', 'తను వెడ్స్ మను రిటర్న్స్', 'రాన్ జానా' వంటి సినిమాలతో బాలీవుడ్ సినిమాల ట్రెండ్ ని మార్చేశారని.. 'జీరో' సినిమాతో మరోసారి కొత్తదనం పంచారని, షారుఖ్ లాంటి పెద్ద స్టార్ ఉన్నారని చూడకుండా వైవిధ్యంగా సినిమాను నడిపించారని.. ఇలాంటి కొత్తదనం ఉన్న సినిమాలపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ సినిమా తనను ఎంతగానో సంతృప్తిపరిచిందని వెల్లడించింది. తనలాంటి స్క్రీన్ ప్లే రైటర్లకు ఈ సినిమా స్ఫూర్తినిస్తుందని, అటువంటి సినిమాను ఎలా విమర్శిస్తారంటూ ప్రశ్నిస్తోంది. ఈ పోస్ట్ ని షారుఖ్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.