దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతారపై సీనియర్ నటుడు, డీఎంకే మాజీ ఎమ్మెల్యే రాధారవి అసభ్యకర కామెంట్స్ చేశాడు. దీంతో ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. వివరాల్లోకి వెళితే.. నయనతార నటించిన తాజా చిత్రం 'కొలైయుధీర్‌ కాలం'. 

హారర్, థ్రిల్లర్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం నాడు చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు నయనతార రాలేదు. అతిథిగా వచ్చిన రాధారవి.. నయన్ ని ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

నయనతార మంచి నటి అని, సినీ రంగంలో హీరోయిన్ గా ఇంతకాలం కొనసాగడం పెద్ద విషయమని చెప్పిన ఆయన నయనతార ఒక చిత్రంలో దెయ్యంగా నటించిందని, మరో సినిమాలో సీతగా కనిపించిందని.. ఇప్పుడు ఎవరైనా సీతగా నటించవచ్చని అన్నారు. ఇంతకముందు సీతగా నటించడానికి కేఆర్ విజయనే ఎంపిక చేసుకునేవారని కానీ ఇప్పుడు చూడగానే నమస్కరించాలనే వారే కాకుండా చూడగానే పిలవాలనిపించే వారు నటించవచ్చని.. నయనతారని చూస్తే దెయ్యాలు పారిపోతాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోపక్క ఈ వ్యాఖ్యలు విన్న నయనతార బాయ్ ఫ్రెండ్ విజ్ఞేశ్ శివన్.. రాధారవిపై మండిపడ్డాడు.  పెద్దవారైనప్పటికీ ఇలా బుర్ర లేకుండా చెత్త వ్యాఖ్యలు చేయడం ఏంటని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. 

అయితే తాజాగా ఈ వివాదంపై స్పందించిన రాధారవి.. తన మాటలు బాధించి ఉంటే క్షమించమని కోరాడు. తన వల్ల పార్టీకి సమస్యలు ఎదురుతాయంటే పార్టీని వదిలేస్తానని చెప్పారు. ఇది ఇలా ఉండగా.. రాధారవి వ్యాఖ్యలను డీఎంకే నేత స్టాలిన్ ఖండిస్తూ.. పార్టీ నుండి ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు.