‘ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకు ఇవ్వరు’.. శత జయంతి ఉత్సవాల్లో ఆర్ నారాయణ మూర్తి విజ్ఞప్తి
నట సార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారక రామరావు శతజయంతి ఉత్సవాలు హైదరాబాద్ లో ఘనంగా జరుగుతున్నాయి. వేదికపై హాజరైన ఆర్ నారాయణ మూర్తి పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు.
నట సార్వభౌమ, తెలుగు తేజం, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ (Sr. NTR) శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులోని ఖైతలాపూర్ గ్రౌండ్ లో వైభవంగా జరుగుతున్నాయి.
తారక రాముని శతజయంతి ఉత్సవాలను నందమూరి బాలక్రిష్ణ అన్నీ తానై చూసుకుంటున్నారు. ఈ వేడుకు సినీ ప్రముఖులు మురళీ మోహన్, జయప్రద, జయసుధ, క్రిష్ణవేణి వంటి సీనియర్ నటీనటులు హాజరయ్యారు. యంగ్ స్టార్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నాగచైతన్య, సుమంత్, అడివి శేష్, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డల కూడా హాజరై వేదికపై ప్రసంగించారు. అలాగే రాజకీయ ప్రముఖులు చంద్రబాబు, బండారు దత్తాత్రేయ, సీతారాం యేచూరితో పాటు సినీ దర్శకుడు, పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి (R Narayana Murthy) కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆర్ నారాయణ మూర్తి పవర్ ఫుల్ స్పీచ్ తో ఆకట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయ పరంగా, కాలానికి ఎదురీదిన వీరుడు సీనియర్ ఎన్టీఆర్. కాలనుగుణంగా మున్ముందుకు సాగిన రాజకీయ చతురతుడు ఆయన. బాలక్రిష్ణ ప్రస్తుతం ఆయన నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తుండటం సంతోషకరం. మిత్రులారా.. ఎన్టీఆర్ ను విశ్వ విఖ్యాత నట సార్వభౌమా అని ఎందుకంటున్నారో తెలుసా.. లార్డ్ లారెన్స్ వారియర్, స్టీఫెన్ బోయిక్, థండర్ హెయిస్టెయిన్, ఎస్బీ రంగారావు, అక్కినేని నాగేశ్వర్ రావు, శివాజీ గణేష్, కన్నడ రాజ్ కుమార్ ఉండగా.. ఎన్టీఆరే ఎందుకంటే.. అన్నీ వేశాల్లో మెప్పించగల నటుడు ఆయన. అందుకే ఆ బిరుదును అందుకున్నారు.
ఇక రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. కేవలం ఎనిమిది నెలల్లోనే జాతీయ పార్టీ కాంగ్రెస్ తో ఢీ అంటే ఢీ అని పోటీ పడి తెలుగు వారి సత్తా చూపించారాయన. అంత గొప్ప వ్యక్తికి ఇంతవరకు ఎందుకు భారతర్నత ఇవ్వలేదు. రాజకీయ పరమైన ఆలోచనతో ఇందిరా గాంధీ ఎంబీఆర్ కు భారతరత్న ఇచ్చారు. కానీ ఆయనకంటే ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి. తప్పకుండా ఇవ్వాలి. చంద్రబాబు కూడా గతంలో ప్రశ్నించారు. ఆ సమయంలోనే కేంద్రంతో కొట్లాడాల్సింది. ఇప్పటికీ భారతరత్న ఇవ్వాలి. ఆయన అర్హుడని కోరుతున్నాను. తెలంగాణ సీఎం కేసీర్, ఏపీ సీఎం జగన్ కూడా ఈ అంశంపై పోరాడాలి‘ అంటూ వ్యాఖ్యానించారు. ఇక గతంలో ఇదే విషయమై మెగా స్టార్ చిరంజీవి కూడా భారతర్నత ఇవ్వాలని కూడా కోరారు.