డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చాలా కాలం తర్వాత సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో పూరి జగన్నాధ్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో పూరి ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ పడుతున్నాయి. రామ్ ని మాస్ లుక్ లో ప్రజెంట్ చేసిన విధానం అదుర్స్. ఈ చిత్రం విడుదలై వారం గడిచినా బాక్సాఫీస్ వద్ద జోరు తగ్గడం లేదు. 

ఆడియన్స్ రెస్పాన్స్ కు తగ్గట్లుగానే చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పూరి జగన్నాధ్ వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఇస్మార్ట్ శంకర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పూరి జగన్నాధ్ తన వ్యక్తిగత విషయాలని కూడా పంచుకున్నాడు. 

2017లో డ్రగ్స్ ఉందంతం తెలుగు చిత్ర పరిశ్రమని కుదిపేసింది. ఈ కేసులో పోలీసులు పలువురు సినీ ప్రముఖుల్ని విచారించారు. అందులో పూరి జగన్నాధ్, చార్మి కూడా ఉన్నారు. కొన్ని గంటల పాటు పూరి, చార్మి పోలిసుల విచారణలో పాల్గొన్నారు. దీనికి తోడు మీడియాలో వస్తున్న గాసిప్స్ మరింత హాట్ టాపిక్ గా మారాయి. 

దీనిపై పూరి స్పందిస్తూ.. తన గురించి వచ్చే ఎలాంటి గాసిప్ నైనా తాను పట్టించుకోనని పూరి అంటున్నాడు. కానీ డ్రగ్స్ కేసు విచారణ సమయంలో నా గురించి వచ్చిన పుకార్లు నా కుటుంబ సభ్యులని బాధ పెట్టాయి. కొన్ని రూమర్స్ విని నా భార్య ఏడ్చినట్లు పూరి తెలిపాడు.