చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ వద్ద పనిచేసిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ అసిస్టెంట్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సాయి కుమార్‌ అనే వ్యక్తి ఇటీవల దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు మాదాపూర్‌ పోలీసులు గుర్తించారు. పోలీస్‌ విచారణలో సాయికుమార్‌ గతంలో పూరీ జగన్నాథ్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసినట్టు తెలుస్తుంది. 

అయితే సాయికుమార్‌ ఆత్మహత్యకి కారణం ఆర్థిక ఇబ్బందులని ప్రాథమికంగా పోలీసుల విచారణలో తేలింది. అప్పుల బాధ తాళలేక ఆయన దుర్గం చెరువులో దూకి సూసైడ్‌ చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్‌ ఇటీవల `లైగర్‌` చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. 

విజయ్‌ దేవరకొండ హీరోగా, అనన్య పాండే కథానాయికగా, రమ్యకృష్ణ, వరల్డ్ మాజీ బాక్సింగ్‌ ఛాంపియన్‌ మైక్‌ టైసన్‌ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం గత నెల 25న ప్రపంచ వ్యాప్తంగా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. కానీ ఇది బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే.