యువ పంజాబీ సింగర్ అకాలమరణం పొందారు. 31ఏళ్ల దిల్జాన్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ వార్త పంజాబ్ చిత్ర పరిశ్రమను దిగ్బ్రాంతికి గురిచేసింది. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. దిల్జాన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. మంగళవారం ఈ ప్రమాద ఘటన జరిగినట్లు తెలుస్తుంది. 

అమ్రిత్ సర్-జలంధర్ హై వేపై ఒంటరిగా కారులో వెళుతున్న దిల్జాన్... జాన్డియాల అనే టౌన్ దగ్గర రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని ఢీకొట్టారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఆయనను సమీపంలో గల ఆస్పత్రికి తీసుకెళ్లడం జరిగింది. అయితే అప్పటికే దిల్జాన్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 


2012లో ప్రసారమైన సర్ క్షేత్ర రియాలిటీ షో దిల్జాన్ కి భారీ ఫేమ్ తీసుకువచ్చింది. ఇండియా, పాకిస్తాన్ సింగర్స్ మధ్య నడిచిన ఈ షోలో దిల్జాన్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. దిల్జాన్ మరణ వార్త తెలుసుకొని పంజాబ్ కి చెందిన ప్రముఖ సింగర్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు.