నిర్మాత సూర్యదేవర నాగవంశీ `లియో` తెలుగు రిలీజ్‌ వివాదంపై స్పందించారు.  టైటిల్‌ వివాదం సాల్వ్ చేస్తున్నామని, ఈ నెల 19న సినిమా వచ్చేది పక్కా అని తెలిపారు.

దళపతి విజయ్‌ హీరోగా నటించిన `లియో` చిత్రం తెలుగులో వివాదంలో ఇరుక్కుంది. ఈ సినిమా టైటిల్‌ మరొకరు రిజిస్టర్‌ చేయడంతో ఇప్పుడు `లియో` విడుదలకు అడ్డంకిగా మారింది. దీంతో ఈ చిత్రం విడుదలవుతుందా? లేదా? అనే అనుమానాలు, రూమర్లు స్ప్రెడ్‌ అవుతున్నాయి. తాజాగా దీనిపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. ఆయన క్లారిటీ ఇచ్చారు. టైటిల్‌ వివాదం సాల్వ్ చేస్తున్నామని, ఈ నెల 19న సినిమా వచ్చేది పక్కా అని తెలిపారు నాగవంశీ. విజయ్‌, త్రిష జంటగా, సంజయ్‌ దత్‌, అర్జున్‌ నెగటివ్‌ రోల్స్ చేస్తున్న చిత్రం `లియో`. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతుంది. తెలుగు హక్కులను సితార ఎంటర్‌టైనర్‌మెంట్‌ బ్యానర్‌పై నాగవంశీ తీసుకున్నారు.

నాగవంశీ `లియో` రిలీజ్‌పై మంగళవారం మీడియాతో మాట్లాడారు. రిలీజ్‌ వివాదంపై ఆయన స్పందించారు. `తెలుగులో `లియో` టైటిల్ ని ఒకరు రిజిస్టర్ చేసుకున్నారు. వారు మమ్మల్ని సంప్రదించకుండా నేరుగా కోర్టుని ఆశ్రయించారు. ఈ విషయం నాకు కూడా మీడియా ద్వారానే తెలిసింది. టైటిల్ రిజిస్టర్ చేసుకున్నవారితో మాట్లాడుతున్నాం. సమస్య పరిస్కారం అవుతుంది. విడుదలలో ఎలాంటి మార్పు ఉండదు. అక్టోబర్ 19నే తెలుగులో కూడా విడుదల అవుతుంది. ఉదయం ఏడు గంటలకు షోస్‌ పడటం పక్కా` `అని తెలిపారు. 

నాగవంశీ ఇంకా చెబుతూ, ``లియో ` తెలుగు టైటిల్ ని కూడా తమిళ నిర్మాతలే రిజిస్టర్ చేయించారు. పైగా ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. కాబట్టి విడుదలకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఇక్కడ తెలుగులో లియో టైటిల్ ని వేరొకరు కూడా రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి.. వాళ్ళకి గానీ, మాకు గానీ ఎటువంటి నష్టం జరగకుండా సమస్యని పరిష్కరించుకుంటాం. ఈ సినిమా బాగుంటుంది అనే నమ్మకంతోనే తెలుగు హక్కులు తీసుకోవడం జరిగింది. దర్శకుడు లోకేష్ నిరాశపరచరు అని అనుకుంటున్నా. ముందుగా అనుకున్న రేటుకే తెలుగు హక్కులు తీసుకున్నాం, అందులో తగ్గించారనేది వాస్తవం కాదని చెప్పారు. 

ఇక `భగవంత్‌ కేసరి`, `టైగర్‌ నాగేశ్వరరావు` చిత్రాలతో పోటీ, థియేటర్ల సమస్యలో నాగవంశీ మాట్లాడుతూ, థియేటర్ల సమస్య లేదని, ఏ సినిమాకి తగ్గట్టుగా ఆ సినిమా విడుదలవుతుందన్నారు. ఏ సినిమాకి కావాల్సినన్ని థియేటర్లు ఆ సినిమాకి కేటాయించారని, `భగవంత్ కేసరి`, `టైగర్ నాగేశ్వరరావు` కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు. తమిళ నిర్మాతలతో కలవడంపై స్పందిస్తూ, `మేము నిర్మించిన వాతి(సార్) చిత్రాన్ని తమిళ్ లో లలిత్ కుమార్ విడుదల చేశారు. ఆ సమయంలో ఏర్పడిన అనుబంధంతో ఇప్పుడు తెలుగులో మేము `లియో `చిత్రాన్ని విడుదల చేస్తున్నాం` అని చెప్పారు. ఈ ఆదివారం లోపు హైదరాబాద్‌లో `లియో` వేడుక నిర్వహిస్తామని, లోకేష్‌, అనిరుథ్‌, త్రిష వస్తారని, విజయ్‌పై క్లారిటీ లేదన్నారు.

ఇదిలా ఉంటే ఈ సందర్భంగా సినిమాల కలెక్షన్లపై ఆయన స్పందించారు. ఏ నిర్మాత తమ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందో చెప్పరని, తమ కలెక్షన్లు బయటపెట్టుకోరని తెలిపారు. మీడియాలో వచ్చే వార్తలన్నీ అవాస్తవాలని, కేవలం అవి స్పెక్యులేషన్సే కానీ, నిజం కాదని, సినిమాకి ఎంత పెట్టారు, ఎంత వచ్చిందనేది పూర్తిగా నిర్మాతకు మాత్రమే తెలుసని, మేం ఆ వివరాలు బయటకు చెప్పమని తెలిపారు. `జెర్సీ` ఫెయిల్యూర్‌ అనే దానిపై స్పందిస్తూ, అది తమకి ప్రాఫిట్‌ ప్రాజెక్ట్ అని, నష్టాలు రాలేదని స్పష్టం చేశారు.