విజయ్ దేవరకొండ కొత్త సినిమా `వీడీ12` పోస్టర్ వివాదంగా మారింది. కాపీ అంటూ సోషల్ మీడియాలో మరో పోస్టర్ హల్‌చల్ చేస్తుంది. 2012లో వచ్చిన హాలీవుడ్ మూవీ `ఆర్గో` పోస్టర్‌ని పోలి ఉండటంతో ఈ వివాదం రాజుకుంది.
సినిమా ఇండస్ట్రీలో `కాపీ` అనేది ఇప్పుడు మేకర్స్ కి పెద్ద తలనొప్పిగా మారింది. రాజమౌళి లాంటి దర్శకుడికే కాపీ వివాదాలు వెంటాడుతుంటాయి. ఆయన ప్రతి సినిమాకి ఇలాంటి వివాదాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండకి కూడా ఎదురయ్యింది. ఆయన బర్త్ డే సందర్భంగా మంగళవారం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. `వీడీ12` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది.
తాజాగా ఈ పోస్టర్ వివాదంగా మారింది. కాపీ అంటూ సోషల్ మీడియాలో మరో పోస్టర్ హల్‌చల్ చేస్తుంది. 2012లో వచ్చిన హాలీవుడ్ మూవీ `ఆర్గో` పోస్టర్‌ని పోలి ఉండటంతో ఈ వివాదం రాజుకుంది. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. పోస్టరే కాదు, కథ కూడా కాపీనా అనేది అందరి నోట వినిపిస్తున్న మాట. ఇటీవల కాలంలో సైలెంట్‌గా కథలు లేపడం, కామన్ అయిపోయింది. క్రెడిట్ ఇవ్వకుండానే కథలు, కాన్సెప్ట్ లు కొట్టేస్తున్నారు మేకర్స్. దీంతో `వీడీ12` కూడా ఆ కేటగిరిలోకే వస్తుందా? అనే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ దేవరకొండ నటించబోతున్న `వీడీ12` పోస్టర్ కాపీ వివాదంపై చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. ఆయన దీనిపై వివరణ ఇచ్చారు. ఇది యాధృచ్చికంగా జరిగిందని తెలిపారు. `ఆర్గో` సినిమా పోస్టర్‌ని తాము కాపీ కొట్టలేదని, స్పై థ్రిల్లర్ చిత్రాల పోస్టర్లు చాలా వరకు ఇలానే ఉంటాయని చెప్పారు. పీరియాడికల్ స్పై థ్రిల్లర్ కావడంతో పేపర్‌ని కట్ చేసినట్టుగా పెట్టి పోస్టర్ డిజైన్ చేయాలనుకున్నాం, కానీ అది అనుకోకుండా `ఆర్గో` సినిమా పోస్టర్‌లా మారిపోయింది` అని తెలిపారు. పోస్టర్ ఇలా ఉందంటే దాని వెనకాల ఏం జరిగింది, ఎందుకు ఇలా డిజైన్ చేయాల్సిందో తెలుసుకోవాలని, బేస్ లేని వార్తలకు ప్రలోభాలకు గురై జడ్జ్ మెంట్ ఇవ్వొద్దని తెలిపారు నాగవంశీ. అంతేకాదు `వీడీ12`ని పోలిన కొన్ని సినిమాల పోస్టర్లని పంచుకున్నారు నాగవంశీ.
అయితే దీనిపై నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. నిర్మాత బాగానే కవర్ చేసినా, నెటిజన్లు మాత్రం కామెంట్లతో సెటైర్లు పేల్చుతున్నారు. మరి అదేదో క్రాస్‌గా కట్ చేయోచ్చు కదా, కాన్సెప్ట్ వీడియోనే ఇవ్వొచ్చు కదా, కొంచెం సిమిలారిటీ కాదు, మొత్తం అలానే ఉందని కౌంటర్లు పేలుస్తున్నారు. ఇది యాదృశ్చికం కాదని, మొత్తం కాపీనే అని, ఆ నిజం పోస్టర్ డిజైన్ చేసిన ఎడిటర్‌కి తెలుసు అంటున్నారు. మొత్తంగా ఇది నెట్టింట రచ్చ చేస్తుంది.
స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న `వీడీ12`లో విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ ఎంటర్‌టైనర్‌మెంట్స్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ సినిమాపై పోస్టర్ కాపీ వివాదం ఇప్పుడు విజయ్‌కి, మేకర్స్ కి తలనొప్పిగా మారింది.
