దిల్‌ రాజు నిర్మించిన `థ్యాంక్యూ` చిత్రం రెండు రోజుల్లో(జులై 22)న విడుదల కానున్న నేపథ్యంలో టికెట్‌ రేట్లపై క్లారిటీ ఇచ్చారు. బుకింగ్స్ లో ఎక్కువ రేట్లు ఉన్న నేపథ్యంలో దిల్‌రాజు స్పందించారు.

నిర్మాత దిల్‌రాజు `థ్యాంక్యూ` సినిమాకి సంబంధించిన టికెట్‌ రేట్లపై క్లారిటీ ఇచ్చారు. ఇకపై స్టార్‌ కానీ హీరోల సినిమాలకి, భారీ బడ్జెట్‌ కానీ సినిమాలకు ఒక్కటే టికెట్‌ రేట్స్ ఉంటాయని తెలిపారు. ఆ దిశగా చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు దిల్‌రాజు. ఆయన నిర్మించిన `థ్యాంక్యూ` చిత్రం రెండు రోజుల్లో(జులై 22)న విడుదల కానున్న నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే అంతకు ముందు మీడియా ఇంటరాక్షన్‌లో సింగిల్‌ థియేటర్లలో 100 ప్లస్ జీఎస్టీ అని, మల్టీప్లెక్స్ ల్లో 150 ప్లస్‌ జీఎస్టీ ఉంటుందని తెలిపారు దిల్‌రాజు. 

YouTube video player

కానీ తాజాగా `థ్యాంక్యూ` సినిమాకి బుకింగ్స్ ఓపెన్‌ అయ్యాయి. ఇందులో సింగిల్‌ స్క్రీన్స్ లో రూ.175, మల్టీప్లెక్స్ లలో రూ.250 ఉండటంతో ఆడియెన్స్ షాక్‌ అవుతున్నారు. మరి తగ్గించిన టికెట్‌ రేట్లు ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. దీంతో తాజాగా నిర్మాత దిల్‌రాజు స్పందించారు. తన వ్యాఖ్యలు తప్పుగా వెళ్లాయో, లేక తాను రాంగ్‌గా చెప్పానో తెలియదు కానీ అంటూ లేటెస్ట్ గా మరో రేట్లు చెప్పారు. 

హైదరాబాద్‌, వైజాగ్‌ వంటి సిటీస్‌లో సింగిల్‌ స్క్రీన్లలో 150 రూపాయలు జీఎస్టీ కలుపుకుని అని, మల్టీప్లెక్స్ ల్లో జీఎస్టీ కలుపుకుని 200 రూపాయలుగా నిర్ణయించామని, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ కూడా ఇదే విషయాన్ని చర్చిస్తుందని, `విక్రమ్‌`, `మేజర్‌` చిత్రాలకు ఏ రేట్స్ అయితే ఉన్నాయో అవే ఉంటాయని, ఇకపై అన్ని సినిమాలకు ఇదే రేట్స్ వర్తిస్తాయని తెలిపారు. అయితే సూపర్‌ స్టార్స్ సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలకు ఇది మినహాయింపు అని చెప్పారు. ఏపిలో ప్రభుత్వం జీవో తెచ్చిందని, అక్కడ టికెట్ రేట్లు మార్చడానికి లేదని, తెలంగాణలో ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాయని, ఇకపై ఓ ఫిక్డ్స్ రేట్లని నిర్ణయిస్తామన్నారు దిల్‌రాజు. 

అదే సమయంలో సినిమా నిడివిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. రెండు గంటల ఐదు నిమిషాలు ఉంటుందని, ఎడిటర్‌, డైరెక్టర్ కాల్‌ అని, అందులో ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపారు. `థ్యాంక్యూ` సినిమా ఓ ఫీలింగ్‌ అని, ఆ ఫీల్‌ని తామందరం ఫీలయ్యామని, రేపు థియేటర్లలో ఆడియెన్స్ కూడా ఫీల్‌ అవుతారని, ఇదొక ఎమోషనల్‌ జర్నీ అని చెప్పారు. సినిమా చూశాక ప్రతి ఒక్క ఆడియెన్ తమ జీవితంలో థ్యాంక్స్ చెప్పాలనుకునే వారి ఫోన్‌ చేస్తారని అంత బాగా నచ్చుతుందని వెల్లడించారు. 

తనకి కూడా నిజ జీవితంలో ఈ స్థాయికి రావడానికి చాలా మంది సహాయపడ్డారని, వారిని ఒక్కొక్కరిని కలుస్తున్నానని, దాన్ని ఓ వీడియోగా విడుదల చేస్తామని తెలిపారు దిల్‌రాజు. నాగచైతన్య, రాశీఖన్నా, మాళవిక నాయర్‌ ప్రధాన పాత్రలు పోషించిన `థ్యాంక్యూ` చిత్రానికి విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం చిత్ర బృందం మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది. సినిమా గురించి అనేక విషయాలను పంచుకుంది.