తాను ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాని చెబుతున్నారు నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌. తాను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించి, క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు తాను ఏ పార్టీలో చేయడం లేదని, రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగినట్టు తెలిపారు. 

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నిర్మాత బండ్ల గణేష్‌ తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారని, ఆయన త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై బండ్ల గణేష్‌ స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. `నాకు ఏ రాజకీయ పార్టీలతో, ఏ రాజకీయాలతో సంబంధం లేదు. నేను రాజకీయాలకు దూరం. దయజేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన.. మీ బండ్ల గణేష్‌` అని పేర్కొన్నారు. తనపై వరుసగా రూమర్లు వస్తున్న నేపథ్యంలో రెండు సార్లు ట్విట్టర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు బండ్లగణేష్‌.

ఇదిలా ఉంటే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండ్ల గణేష్‌ కాంగ్రెస్‌లో చేరాడు. కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. ఆ తర్వాత గతేడాది తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉంటే మళ్లీ ఆయన సినిమాల్లో బిజీ కావాలని చూస్తున్నారు. ఆ మధ్య మహేష్‌ బాబు నటించిన `సరిలేరు నీకెవ్వరు`లో నటుడిగా కనిపించారు. అలాగే పవన్‌ కళ్యాణ్‌తో సినిమా తీసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.