ప్రతిష్టాత్మక ఆస్కార్ పండుగ మరికొద్ది రోజుల్లో జరగబోతుంది. ఈ నెల 26న ఈ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సారి కూడా అమెరికా చిత్రాలతోపాటు విదేశీ విభాగంలో అనేక ఇతర దేశాలకు చెందిన సినిమాలు కూడా పోటీపడుతున్నాయి. అందులో గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా చిత్రం కూడా ఉండటం విశేషం. ఆమె నటించిన `ది వైట్‌ టైగర్‌` ఆస్కార్‌ అవార్డు కోసం పోటీలో ఉంది. ఈ ఇండియా- అమెరికా చిత్రం ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్‌కి పోటీపడుతుంది. 

`మదర్‌ ఇండియా`, `సలామ్‌ బాంబే`, `లగాన్‌` చిత్రాల తర్వాత ఇండియాకి చెందిన ఓ సినిమా ఆస్కార్ కి నామినేట్‌ కావడం విశేషం. అయితే ఇది పూర్తి స్థాయి ఇండియన్‌ సినిమా కాకపోవడం గమనార్హం. 2002లో `లగాన్‌` తర్వాత అంటే దాదాపు ఇరవైఏళ్ల తర్వాత ఇండియాకి చెందిన సినిమా ఆస్కార్‌ బరిలో నిలవడం విశేషం. దీంతో ఆసక్తి నెలకొంది. ఈ  ఏప్రిల్‌ 26వ తేదీ ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ స్టార్‌ మూవీస్, స్టార్‌ వరల్డ్‌ ఛానెల్స్‌లో ఈ పురస్కారాల పండుగ ప్రసారమవుతోంది. 

`ద వైట్‌ టైగర్‌` సినిమాలో ప్రియాంక చోప్రాతోపాటు రాజ్‌ కుమార్‌ రావ్‌, ఆదర్శ్‌ గౌరవ్‌ నటించారు.అమెరికా దర్శకుడు రామిన్‌ బహ్రాని దర్శకత్వం వహించారు. ముంబయికి చెందిన నిర్మాత ముఖుల్‌ డియోరా నిర్మించారు. ఇది ఇప్పటికే అమెరికాలో విడుదలై ఆకట్టుకుంది. నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైంది. మరి ఈ సారి ఆస్కార్‌ బరిలో ఉన్న ఈ సినిమాకి అవార్డు వరిస్తుందా? అదృష్టం వరిస్తుందా? అన్నది చూడాలి. ఒకవేళ అవార్డు వచ్చినా అది అమెరికా డైరెక్టర్‌కే కావడం గమనార్హం.