Asianet News TeluguAsianet News Telugu

'లవర్స్ డే' మూవీ రివ్యూ..

సినీ ప్రపంచం పుట్టిన నాటి నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది హీరోయిన్స్...తెరపై కన్ను గీటారు. అయితే వాళ్ల హావభావాలు ఏవీ ప్రియాప్రకాష్ వారియర్ రేంజిలో లేవు. దాంతో  కన్ను కొట్టడానికే పుట్టినట్లున్నట్లు, దానికి ఆమెను బ్రాండ్ అంబాసిడర్ ని చేసేసారు. 

priya prakash warrier lovers day movie review
Author
Hyderabad, First Published Feb 14, 2019, 1:47 PM IST

--సూర్య ప్రకాష్ జోశ్యుల

సినీ ప్రపంచం పుట్టిన నాటి నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది హీరోయిన్స్...తెరపై కన్ను గీటారు. అయితే వాళ్ల హావభావాలు ఏవీ ప్రియాప్రకాష్ వారియర్ రేంజిలో లేవు. దాంతో  కన్ను కొట్టడానికే పుట్టినట్లున్నట్లు, దానికి ఆమెను బ్రాండ్ అంబాసిడర్ ని చేసేసారు. దేశం మొత్తం ఆమె కన్ను గీటులో రొమాన్స్ పండించుకుంది. ఇంకేముంది ఆ సినిమా దర్శక,నిర్మాతలు పండుగ చేసేసుకున్నారు. ఆ ఒక్క కన్ను కొట్టే విజువలతో కోట్లు సంపాదించాలని స్కెచ్ వేసేసారు. వాళ్లు అనుకున్నట్లుగానే పోటీపడి మరీ బిజినెస్ జరిగింది. 

ఆ గొడవల్లో పడి, కొన్ని రీషూట్ లు చేసుకుంటూ  సినిమా రిలీజ్ ని వాయిదాలు వేసుకుంటూ ఇధిగో ఇన్నాళ్ళకు తెరపైకు తీసుకు వచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే వేడి చల్లారి పోయాక వడ్డించారు. అయితే సినిమాలో విషయం ఉంటే కాలం అనేది సమస్య కాదు అనేది చాలా సార్లు ప్రూవైన సత్యం. మరి ఈ సినిమాలో జనాలని ఎట్రాక్ట్ చేసే ఎలిమెంట్ ఏదైనా ఉందా లేక కేవలం కన్ను కొట్టి మనల్ని పడకొట్టాలనే ఆలోచన తప్ప వేరే ఏమీ లేదా , అసలు ఇంతలా సెన్షేషన్ గా మారిన ఈ సినిమా కథేంటి..మన తెలుగు కాలేజీ కుర్రాళ్లకు, కుర్రమ్మలకు ఎక్కుతుందా రివ్యూలో చూద్దాం. 

 

కథేంటి..

డాన్ బాస్కో హ‌య్య‌ర్ సెకండ‌రీ స్కూల్లో  చదివే టీనేజ్ పిల్లలు  రోష‌న్ (రోష‌న్‌),   ప్రియ (ప్రియా వారియ‌ర్‌) . అన్ని సినిమాల్లో లాగానే ఇందులోనూ ప్రియను ...రోషన్ టీజ్ చేస్తాడు. దాంతో రొటీన్ గానే వాళ్లిద్దరూ ప్రేమలాంటి ఆకర్షణలో పడతారు. అందరి దృష్టిలోనూ పడతారు. అయితే ప్రియ తాను ప్రేమలో పడ్డ విషయం మొదట ఒప్పుకోదు. కానీ స్నేహితుల సహకారంతో ఇద్దరు తమ ప్రేమలు వ్యక్త పరుచుకుంటారు. 

ఇలా   వీరి ప్రేమ ముదిరి పాకాన పడబోతుందనుకునే సమయంలో వాళ్లు కాలేజీలోని ఫ్రెండ్స్ పెట్టుకున్న  వాట్సప్ గ్రూప్ లో ఓ వీడియో వల్ల విరోధాలు వస్తాయి. తన  ఫ్రెండ్ చేసిన తప్పు తనపై పడి..ప్రిన్సిపాల్ ముందు రోషన్ దోషిగా నిలబడతాడు. ఆ సమయంలో తను ఎంతో ఇష్టపడ్డ ప్రియ సపోర్ట్ చేస్తుందేమో అని ఆసిస్తాడు.  సపోర్ట్ ఇవ్వదు సరికదా ఏకంగా  బ్రేక‌ప్ చెబుతుంది.  వీళ్లిద్దరూ విడిపోవటం మిగతా ఫ్రెండ్స్ కు బాధ కలిగిస్తుంది. దాంతో వారంతా  విడిపోయిన ఈ  ప్రేమికుల్ని మ‌ళ్లీ ఒక్క‌టి చేయాల‌ని ఓ ప్లాన్ వేస్తారు. 

మళ్లీ సినిమాటెక్ గానే ప్రియాలో ఈర్ష్య క‌లిగించాల‌ని స్నేహితులంతా క‌లిసి రోషన్ మరో స్నేహితురాలు గాథ, రోష‌న్‌లు ప్రేమలో ప‌డిన‌ట్టుగా న‌టించాల‌ని సలహా ఇస్తారు. అయితే సినిమా మొత్తానికి ఇక్కడే ఓ ట్విస్ట్ . కొన్నాళ్ల‌ త‌ర్వాత  ఆ ఇద్దరి మ‌ధ్య నిజంగానే ప్రేమ పుడుతుంది. నట‌న‌గా మొద‌లుపెట్టిన వారి ప్రేమ నిజ‌మ‌వుతుంది. ఈ డ్రామా చివరకు ఎలాంటి క్లైమాక్స్ కు దారి తీసింది?   ప్రియ‌, రోష‌న్ మ‌ధ్య ప్రేమ కథ చివరకు ఏమైంది?  రోషన్‌, ప్రియా, గాథ‌ల ట్రయాంగిల్ లవ్ స్టోరీలో  ఎలాంటి మ‌లుపులు చోటు చేసుకున్నాయ‌న్న‌ది తెర‌పైనే చూడాలి.

 

ఇలాంటివి ఎన్నో చూసేసాం..

డైరక్టర్ ఓ టీనేజ్ లవ్ స్టోరీని చూపాలనుకున్నాడు. ఓకే. అయితే అది ఓల్డేజ్ లవ్ స్టోరీ గా మారుతోందని గమనించుకోలేకపోయాడు. స్టోరీ లైన్ ..ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా టర్న్ తీసుకుంటున్నప్పుడే అర్దమవుతుంది... ఇది  ఓ ఇరవై ఏళ్ల క్రితం నాటి  కథ..ఇప్పుడు చెప్తున్నారు అని. ఇలాంటివి మనం బోలెడు చూసేసాం. ఇప్పుడు టీనేజ్ ప్రపంచం పూర్తిగా మారిపోయింది. వాట్సప్ లు పెట్టినంత సినిమాకు ఆధునిక కాలం లుక్ వచ్చేయదు కదా. ఈ కాలం టీనేజ్ పిల్లల ఆలోచనల్లోకి వెళ్లగలగాలి. అది డైరక్టర్ చేయలేకపోయాడు. కుళ్లు జోక్ లు, క్లాస్ రూమ్ లో కళ్ల చూపులుతోనే సినిమాని లాగించేద్దామనుకున్నాడు. అయినా సెకండాఫ్ లో ఎక్కడో చిన్న కాంప్లిక్ట్ పెట్టుకుంటే సినిమా అక్కడ దాకా వెళ్లేదాకా ఎంత ప్లాట్ గా , బోర్ గా ఉంటుందో అని ఊహించలేకపోయారు. 

 

ప్రియా వారియర్ కు అంత లేదు..

ఇక సినిమా చూస్తూంటే మనకు స్పష్టంగా అర్దమయ్యే విషయం ఏమిటంటే....కన్ను కొట్టే విజువల్స్ సూపర్ హిట్ అయ్యాక..ప్రియాకు క్రేజ్ వచ్చాక..కథను మార్చి, ఆమె క్యారక్టర్ లెంగ్త్ పెంచి  రూషూట్ చేసారని. కానీ మూల కథలో ఆ పాత్రకు అంత సీన్ లేనప్పుడు ఎన్ని సీన్స్ వేస్తే మటకు ఫలితం ఏమిటి.అదే జరిగింది..ప్రియా ప్రకాష్ వారియర్ పూర్తిగా తేలిపోయింది.  ఆమెకు ,రోషన్ కు మధ్య జరిగే లవ్ స్టోరీ బా...గా సాగతీసి ,మన తాట తీస్తున్నారని స్పష్టమవుతుంది. అయినా మన కాలేజీల్లో  యూనిఫార్మ్ లు వేసుకోరు కదా. దాంతో ఏదో తేడాగా ఏ ఎనిమిదో తరగతో చదివో అమ్మాయి ప్రేమ కథలా అనిపిస్తూంటుంది. అంతే కానీ ప్లస్ టు అనిపించదు. 

 

ఉన్నంతలో..

ఇక ఈ సినిమాలో ఏదన్నా చెప్పుకోదగ్గ చెప్పుకోదగినది ఉందీ అంటే అది క్లైమాక్స్ సీన్స్ మాత్రమే.  అయితే అప్పటిదాకా ఆ బోర్ ని, నసని భరించి కూర్చోగలగాలి కదా. 

 

టెక్నికల్ గా..

ఈ సినిమా కథా పరంగానే కాదు..మిగతా విభాగాల్లోనూ అంతంత  మాత్రమే. ఏదో ఆ కన్ను కొట్టే విజువల్, ముద్దుల‌తో గ‌న్ను  పెట్టే విజువల్ తప్పిస్తే సినిమాలో చెప్పుకోవటానికి ఏమీ లేవు. వాటి కోసం తెరమీద అంత డబ్బు, టైమ్ ఖర్చు పెట్టాలంటే కాస్తంతం ఇబ్బందే.   సంగీతం విషయానికి మొత్తం తొమ్మిదిలో రెండు పాటలు బాగున్నాయి. కెమరా వర్క్ అద్బుతం కాదు కానీ బాగుంది. పాటలు మాత్రం బాగా తీసారు. అప్పట్లో ప్రేమ కథలు తీసే కదిర్ గుర్తు వచ్చారు. ఇక  డబ్బింగ్  అయితే ...ఇదేం ఆడే సినిమా కాదులే...ఎందుకంత కష్టపడటం అన్నట్లుగా తూతూ మంత్రం గా చేసేసారు.  . ఎడిటర్ అచ్చు విజ‌య‌న్‌  మరింత ట్రిమ్ చేయచ్చు కదా అని సీన్స్ సాగుతున్నప్పుడు కోపం వస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ అంతంత మాత్రమే. 

 

ఫైనల్ థాట్

‘హ్యాపీడేస్’ సినిమా మళ్లీ ఓ సారి చూడాలి. ఈ డైరక్టర్ ఇప్పటిదాకా చూడకపోతే ఆయనకు పంపాలి. 

Rating: 1.75/5

ఎవరెవరు..

న‌టీన‌టులు: ప్రియా ప్రకాశ్‌ వారియర్, నూరిన్ షెరిఫ్‌, రోష‌న్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, మైఖేల్ యాన్ డేనియ‌ల్‌, దిల్‌రూపా, హ‌రీష్ పెరుమ‌న్న‌, అనీష్ జి మీన‌న్‌, షాన్ సాయి, అర్జున్ హ‌రికుమార్‌, అతుల్ గోపాల్‌, రోష్న అన్‌రాయ్ త‌దిత‌రులు

ఛాయాగ్ర‌హ‌ణం: శీను సిద్ధార్థ్‌

కూర్పు: అచ్చు విజ‌య‌న్‌

సంగీతం: షాన్ రెహ‌మాన్‌

స్క్రీన్‌ప్లే: సారంగ్ జ‌య‌ప్ర‌కాష్‌ లిజో ప‌నాడా

నిర్మాత‌లు: ఎ. గురురాజ్‌, సి.హెచ్‌. వినోద్‌రెడ్డి

క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఒమ‌ర్ లులు 

సంస్థ: సుఖీభవ సినిమాస్ 

విడుదల: 14 ఫిబ్రవరి 2019

Follow Us:
Download App:
  • android
  • ios