మలయాళీ భామ ప్రియా ప్రకాష్ వారియర్ 'ఒరు అడార్ లవ్' చిత్రంతో పాపులారిటీ దక్కించుకుంది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ప్రియా ప్రకాష్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. బాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీకి ఛాన్స్ దక్కింది.

ప్రస్తుతం ఈమె నటించిన 'శ్రీదేవి బంగ్లా' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఆమె నటిగా కంటే చదువుకుంటేనే బాగుంటుందని తన టీచర్లు అభిప్రాయపడుతున్నారట. ఈ విషయాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

చదువును మధ్యలోనే ఆపాలని తన తల్లితండ్రులు ఎప్పుడూ చెప్పలేదని, అలా చేయడం వారికి ఇష్టం లేదని తెలిపింది. మరో ఏడాదిలో డిగ్రీ పట్టా అందుకుంటానని, అప్పుడు పూర్తిగా సినిమాలపై దృష్టి సారించవచ్చని చెప్పింది.

అయితే తనకు చదువు చెప్పిన టీచర్లు మాత్రం నటనలో కంటే చదువులోనే చురుకుగా ఉంటానని భావిస్తున్నారని, నటించడం ఆపేసి చదువుపై దృష్టి పెట్టాలని చెబుతున్నట్లు వెల్లడించింది. తనకు మాత్రం నటించడమంటేనే ఇష్టమని తేల్చి చెప్పింది. 'ఒరు అడార్ లవ్' సినిమాలో తన సహనటుడిగా కనిపించిన రోషన్ అబ్దుల్ తో కలిసి మరో సినిమా చేసే  ఛాన్స్ ఉందని, ఇంకా ఫైనల్ కాలేదని తెలిపింది.