Asianet News TeluguAsianet News Telugu

నేషనల్‌ అవార్డులు వస్తే కలిసి రారా?.. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు, డైరెక్టర్లకి ప్రకాష్‌ రాజ్‌ చురకలు..

 అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు వస్తే అందరు తెలుగు హీరోలకు అవార్డు వచ్చినట్టే అని, కానీ దాన్ని సెలబ్రేట్‌ చేసుకునేందుకు కలిసి రావడం లేదు ఎందుకు అని ప్రశ్నించారు ప్రకాష్‌ రాజ్‌.

prakash raj bold comments on tollywood star heroes and directors arj
Author
First Published Oct 22, 2023, 2:26 PM IST | Last Updated Oct 22, 2023, 2:29 PM IST

జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌(Allu Arjun) ఇటీవల నేషనల్‌ అవార్డు(National Award) అందుకున్న విషయం తెలిసిందే. బెస్ట్ యాక్టర్‌గా జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా బన్నీ రికార్డు సృష్టించారు. మూడు రోజుల క్రితమే ఢిల్లీలో ఈ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక వేడుక జరిగింది. బన్నీ, దేవిశ్రీప్రసాద్‌, చంద్రబోస్‌, రాజమౌళి, డీవీవీ దానయ్య, ఇతర టెక్నీషియన్లు, నిర్మాతలు జాతీయ అవార్డులు అందుకున్నారు. పది జాతీయ అవార్డులు టాలీవుడ్‌కి రావడం ఇదే మొదటిసారి. 

దీంతో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ జాతీయ అవార్డులు సాధించిన వారిని అభినందిస్తూ సెలబ్రేషన్‌ నిర్వహించింది. శనివారం రాత్రి గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశారు. ఇందులో నటుడు ప్రకాష్‌ రాజ్‌ (Prakash Raj) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది తెలుగు చిత్ర పరిశ్రమ(టీఎఫ్‌ఐ) గొప్పతనమని తెలిపారు. తెలుగు నటుడికి మొదటిసారి జాతీయ అవార్డు వచ్చింది. ఇది సెలబ్రేట్‌ చేసుకునే టైమ్‌. అల్లు అర్జున్‌కి వస్తే, ఇది అందరు నటులకు వచ్చినట్టే అని, దాన్ని సంభ్రమించాలని తెలిపారు. 

అయితే అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు వస్తే అందరు తెలుగు హీరోలకు అవార్డు వచ్చినట్టే అని, కానీ దాన్ని సెలబ్రేట్‌ చేసుకునేందుకు కలిసి రావడం లేదు ఎందుకు అని ప్రశ్నించారు. అలాగే రాజమౌళి `ఆర్‌ఆర్‌ఆర్‌` తో ఆస్కార్‌కి వెళ్లారు. ఈ సినిమాకి జాతీయ అవార్డు వచ్చాయి, ఈ సంతోషాన్ని సెలబ్రేట్‌ చేసుకునేందుకు స్టార్‌ డైరెక్టర్లు రావడం లేదు ఎందుకు అని ప్రశ్నించారు. 25ఏళ్ల క్రితం తనకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు అప్పుడు సంభ్రమించడానికి ఎవరూ లేరని, కానీ ఇప్పుడు మైత్రీ వాళ్లు ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. 

తెలుగు సినిమా పాన్‌ ఇండియాకి వెళ్లింది. గ్లోబల్‌ స్థాయిలో సత్తా చాటుతున్న తరుణంలో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అంతా కలిసి వస్తే బాగుంటుందని, మనల్ని మనమే ప్రోత్సహించకపోతే ఎలా అని ప్రకాష్‌ రాజ్‌ అన్నారు. టాలీవుడ్‌ పెద్దలు, స్టార్‌ డైరెక్టర్లకి ఆయన పరోక్షంగా చురకలు అంటించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బన్నీపై ప్రశంసలు కురిపించారు. తనని చిన్నప్పట్నుంచి చూస్తున్నానని, షూటింగ్‌ లొకేషన్‌లో వచ్చిన సైలెంట్‌గా కూర్చొనే వాడని, అప్పట్లోనే ఆ స్పార్క్ చూశానని, పైకి తీసుకురావాలని అల్లు అరవింద్‌కి చెప్పినట్టు తెలిపారు. బన్నీ తనని తాను మౌల్డ్ చేసుకున్న నటుడు అని తెలిపారు. అంతేకాదు ఇప్పుడు కలిసినప్పుడు ఇది కాదు, ఇంకా మున్ముందు మరింతగా రీచ్‌ కావాలి, ఇంకా చాలా చేయాలి అని తనతో చెప్పాడని, అది ఒక నటుడికి ఉండాల్సిన స్పిరిట్‌ అని కొనియాడారు ప్రకాష్‌. జాతీయ అవార్డు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios