రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'సాహో' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమానుప్రపంచ ప్రఖ్యాత థియేటర్ గ్రాండ్ రెక్స్ లో ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పారిస్ లో ఉన్న ఈ థియేటర్ లో ఒకేసారి 2800 మంది ప్రేక్షకులు సినిమాను చూడొచ్చు. ఇప్పటికే సౌత్ నుండి కబాలి, బాహుబలి,  మెర్సల్, విశ్వరూపం 2 లాంటి సినిమాలను ఈ థియేటర్లో ప్రదర్శించారు. తాజాగా 'సాహో'కి ఇలాంటి ఘనత దక్కింది.

నిజానికి ఈ థియేటర్ లో సినిమా ప్రదర్శన దొరకడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తారు. ఇప్పుడు 'సాహో'కి ఆ ఛాన్స్ రావడంతో అభిమానులు గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే గ్రాండ్ రెక్స్ థియేటర్ వద్ద 'సాహో' సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు.

శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, మందిరా బేడీ, అరుణ్ విజయ్ ఇలా ఎందరో పేరున్న నటీనటులు కనిపించనున్నారు. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఆగస్ట్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.