ఇండియన్‌ సినిమాలు తమ పరిధిని పెంచుకుంటూ పోతున్నాయి. ఇప్పటికే మన సినిమాలు చైనా, జపాన్ లాంటి ప్రాంతాల్లో భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. కొన్ని సినిమాలు అక్కడి ప్రాంతీయ సినిమాలను కూడా దాటి రికార్డ్‌ వసూళు సాధిస్తున్నాయి. తాజాగా తెలుగు సినిమా సాహో కూడా అలాంటి రికార్డ్‌ సృష్టించింది. జపాన్‌ లో సాహో రికార్డ్ వసూళ్లు సాధించింది. సాహో సినిమాను జనవరిలోనే జపాన్‌లో రిలీజ్ చేశారు.

అయితే ఆ తరువాత కొద్ది రోజులకే లాక్‌ డౌన్‌ రావటంతో థియేటర్లు మూత పడ్డాయి. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గటంతో థియేటర్లు తిరిగి తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో సాహో సినిమాను మళ్లీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సరికొత్త రికార్డ్‌లు సృష్టించింది సాహో. తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్‌ సినిమాగా రికార్డ్ సృష్టించింది సాహో. ఇప్పటి వరకు ఈ రికార్డ్ ఆమిర్‌ ఖాన్ సూపర్ హిట్ సినిమా దంగల్‌ పేరిట ఉంది. సాహోతో పాటు ఇంగ్లీష్‌ వింగ్లీష్, 3 ఇడియట్స్‌, ముత్తు, బాహుబలి 2 సినిమాలు కూడా ఉన్నాయి.

ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే సాహో తరువాత లాంగ్‌ గ్యాప్ తీసుకున్న ప్రభాస్, ప్రస్తుతం జిల్‌ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే  హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమాతో పాటు నాగ అశ్విన్ దర్శకత్వంలో పాన్‌ ఇండియా లెవల్‌లో మరో భారీ చిత్రంలో నటించేందుకు ఓకె చెప్పాడు ప్రభాస్‌.