టాలీవుడ్‌ యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా వర్షం. అప్పటి వరకు మామూలు హీరోగా ఉన్న ప్రభాస్‌ వర్షం సక్సెస్‌ తో స్టార్‌ లీగ్‌లోకి చేరిపోయాడు. దీంతో ఈ సినిమా దర్శకుడు శోభన్ ప్రభాస్‌కు మంచి స్నేహితుడిగా మారిపోయాడు. శోభన్ కెరీర్‌లో కూడా బిగ్గెస్ట్ హిట్ సినిమా వర్షం ఒక్కటే. ఈ సినిమా తరువాత ఒకటి రెండు సినిమాలు చేసిన శోభన్ 2008లో హార్ట్‌ ఎటాక్‌తో మరణించాడు.

దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్‌ శోభన్ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి, తరువాత హీరోగా కూడా నటించాడు. ఈ యంగ్ హీరో గోల్కొండ హైస్కూల్‌, పేపర్ బాయ్‌, తను నేను లాంటి సినిమాల్లో నటించాడు. ఆ సినిమాలతో ఆకట్టుకున్న సంతోష్ మరిన్ని సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే తాజాగా ఈ యంగ్ హీరో ప్రభాస్‌ బంపర్‌ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

ప్రభాస్ సొంత బ్యానర్ యూవీ క్రియేషన్స్‌లో యంగ్ హీరోలతో లో, మీడియం బడ్జెట్‌ సినిమాలను నిర్మించేందుకు రెడీ అవుతోంది. అయితే సంతోష్‌ శోభన్‌తోనూ ఓ సినిమా చేయాలంటూ ప్రభాస్ సూచించాడు. గతంలో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన పేపర్ బాయ్ ట్రైలర్‌ను కూడా ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. తను నేను సినిమా ప్రమోషన్‌లోనూ ప్రభాస్ సాయం చేశాడు. ప్రభాస్ సజెస్ట్ చేయటంతో యూవీ సంస్థ సంతోష్‌తో రెండు సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.