నేచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రా అండ్ రస్టిక్ విజువల్స్ తో ఈ చిత్రం తెరకెక్కింది.
నేచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రా అండ్ రస్టిక్ విజువల్స్ తో ఈ చిత్రం తెరకెక్కింది. నాని తొలిసారి ఊర మాస్ అవతారంలో అలరించాడు. ఫలితంగా ఈ చిత్రం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.
డెబ్యూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తొలి చిత్రంతోనే కుంభస్థలాన్ని కొట్టాడు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రంలో నాని సరసన నటించిన కీర్తి సురేష్ నటనకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఈ చిత్రానికి ప్రేక్షకులతో పాటు స్టార్స్ నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.
ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దసరా చిత్రంపై కామెంట్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు.

'ఇప్పుడే దసరా చిత్రం చూశా.. అద్భుతమైన చిత్రం.. నాకు బాగా నచ్చింది. నాని ఇలాంటి చిత్రం చేసినందుకు కంగ్రాట్స్ చెబుతూ అభినందిస్తున్నా. నాని, కీర్తి సురేష్, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, చిత్ర యూనిట్ పనితీరు అద్భుతంగా ఉంది. మనం ఇలాంటి చిత్రాలు మరిన్ని చేయాలి' అని ప్రభాస్ కామెంట్స్ చేయడం విశేషం.
ప్రభాస్ అంతటి స్టార్ నుంచి దసరా చిత్రానికి కాంప్లిమెంట్స్ లభించడం చిత్ర యూనిట్ కి మంచి బూస్ట్ ఇచ్చినట్లే అవుతుంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. సుకుమార్ కి శిష్యుడిగా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆల్రెడీ సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు సాన.. ఉప్పెన చిత్రం తెరకెక్కించి అదరగొట్టాడు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల రూపంలో మరో సుకుమార్ శిష్యుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు.
