ప్రముఖ దిగ్గజ దర్శకుడు తాతినేని రామారావు(84) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు.
ప్రముఖ దిగ్గజ దర్శకుడు తాతినేని రామారావు(84) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. ఎన్టీఆర్ తో `యమగోల` వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన తాతినేని రామారావు 1966నుంచి 2000 వరకు తెలుగు, హిందీలో డెబ్బైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. అనేక సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. అన్ని రకాల జోనర్ చిత్రాలను రూపొందించి తన ప్రత్యేకతని చాటుకున్నారు. మారిన కాలాం, సినిమా కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు.
తాతినేని రామారావు కృష్ణా జిల్లాలోని, కపిలేశ్వరపురంలో 1938లో జన్మించారు. ఆయన టి. రామారావుగా పాపులర్ అయ్యారు. 1966లో ఆయన `నవరాత్రి` చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. అంతకంటే ముందు 1950 సమయంలో ఆయన తన కజిన్ దర్శకుడు టి.ప్రకాష్‌రావు, కోటయ్య ప్రత్యగాత్మ ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. తొలి చిత్రం `నవరాత్రి` తమిళ సినిమాకి రీమేక్. అందులో శివాజీ గణేషన్, సావిత్రిలు జంటగా నటించారు. తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి కలిసి నటించారు. సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దర్శకుడిగా టి. రామారావు వెనక్కి తిరిగి చూసుకోవాల్సి అవసరం రాలేదు.
ఆ తర్వాత రెండేళ్లకి ఏఎన్నార్, జయలలితలతో కలిసి `బ్రహ్మచారి` చిత్రాన్ని రూపొందించి మరో హిట్‌ని అందుకున్నారు. ఇలా గ్యాప్ లేకుండా `మంచి మిత్రులు`, `రైతు కుటుంబం`, `జీవన తరంగాలు`, `యమగోల`, `శ్రీరామ రక్ష` వరుసగా తెలుగులో 1978 వరకు 12 సినిమాలు చేశారు. ఏడాదికో సినిమా చొప్పున చేసుకుంటూ వచ్చారు. ఇంతలో ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 1979లో `లోక్ పర్లోక్` చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఇది `యమగోల` చిత్రానికి రీమేక్ కావడం విశేషం. ఇందులో జితేంద్ర,జయప్రద నటించారు. ఈచిత్రం బాలీవుడ్‌లోనూ సక్సెస్ సాధించడంతో 1980 నుంచి వరుసగా హిందీ సినిమాలు చేసుకుంటూ వచ్చారు.
మధ్యలో తెలుగులో `ఆటగాడు`, `అనురాగ దేవత`(1982), `పచ్చని కాపురం`(1985), `న్యయానికి శిక్ష`(1988), `అగ్ని కెరటాలు`(1988), `తల్లి తండ్రులు`(1991), `గోల్‌మాల్ గోవిందం`(1992) వంటి సినిమాలు చేశారు. తెలుగులో కంటే ఆయన హిందీ సినిమాలే ఎక్కువగా చేయడం విశేషం. బాలీవుడ్‌లోకి వెళ్లాక దాదాపు అన్ని రీమేక్ చిత్రాలే చేశారు. ఆయన దర్శకుడిగా వహించిన చిత్రాల్లో సగం రీమేక్‌లే ఉండటం గమనార్హం. తమిళంలో హిట్ అయిన చిత్రాలను హిందీలో చేసి హిట్ కొట్టారు. ఇండియన్ సినిమాకి ఆయన కమర్షియాలిటీని పరిచయం చేసిన దర్శకుడిగా తాతినేని రామారావుకి పేరుంది. దర్శకుడి మరణం పట్ల చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
