ఓల్డేజ్ హోమ్‌లో దిగ్గజ దర్శకుడు కన్నుమూత..
చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దిగ్గజ దర్శకుడు కన్నుమూశారు. మలయాళ చిత్ర పరిశ్రమని కొత్త పుంతలు తొక్కించిన గ్రేట్ డైరెక్టర్ కేజీ జార్జ్ (77) ఆదివారం తుదిశ్వాస విడిచారు.
చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దిగ్గజ దర్శకుడు కన్నుమూశారు. మలయాళ చిత్ర పరిశ్రమని కొత్త పుంతలు తొక్కించిన గ్రేట్ డైరెక్టర్ కేజీ జార్జ్ (77) ఆదివారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో ఆయన మరణించినట్టు మలయాళ మీడియా వెల్లడించింది. అయితే ఆయన కక్కనాడ్ ఓల్డేజ్ హోమ్‌లో ఆదివారం మరణించడం బాధాకరం. ఎన్నో గొప్ప సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్‌గా రాణించిన ఆయన ఓల్డేజ్ హోమ్‌లో మరణించడం అత్యంత బాధాకరం.
దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు మలయాళ చిత్ర పరిశ్రమకి విశేష సేవలందించారు దర్శకుడు కేజీ జార్జ్. ఆయన ఎక్కువగా మమ్ముట్టితో సినిమాలు రూపొందించారు. సుకుమారన్, శారదల వంటి వారితోనూ ఎక్కువ సినిమాలు చేశారు. కుటుంబ అనుబంధాలు ప్రధానంగా ఆయన చిత్రాలు తెరకెక్కించి అనేక విజయాలు అందుకున్నారు. 1972లో `మాయ` అనే చిత్రంలో ఆయన అసోసియేట్ డైరెక్టర్‌గా కెరీర్‌ని ప్రారంభించారు.
ఆ తర్వాత `నీలు` సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారారు. దీనికి ఆయనే స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. 1976లో వచ్చిన `స్వప్నదానం` చిత్రంతో ఆయన దర్శకుడిగా మలయాళ చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. దాదాపు 20 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇందులో మమ్ముట్టి నటించిన `మేళ`, `యవనిక`, `కథక్కు పిన్నిల్`, `మట్టోరల్` చిత్రాలు నిర్మించారు.
వీటితోపాటు `ఐలవంకోట్ దేశం`, `పంచవాడి పాలం`, `ఇరకల్`, `ఆడామింటే వారియెల్లే`, `లెఖయుడ్ మరణం` వంటి చిత్రాలు రూపొందించారు. ఆయన సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ మాత్రమే కాదు, మహిళా సాధికారత, సమాజంలో అణచివేత, దోపిడి వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. పలు పొలిటికల్ డ్రామాలను, కాంట్రవర్షియల్ మూవీస్‌ని కూడా రూపొందించారు. ఓ రకంగా సమాజంలో మార్పుకి తనవంతు సినిమాతో సేవలందించారు. అందుకే కేజీ జార్జ్ మలయాళ చిత్ర పరిశ్రమ ఓ పెద్దగా భావిస్తుంది.
దీంతోపాటు ఆయన రూపొందించిన చిత్రాలకు కేరళా స్టేట్ అవార్డులు వరించాయి. విశేష ప్రశంలందుకున్నాయి. మలయాళ చిత్ర పరిశ్రమని ప్రభావితం చేసిన దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు.దీంతోపాటు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూడా ఆయన కృషి చేశారు. టెక్నీషియన్ల కోసం మలయాళం సినీ టెక్నీషియన్స అసోసియేషన్‌ని స్థాపించడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఫౌండర్, ఛైర్మెన్‌గా వ్యవహరించారు.
కేరళాలో 1945 మే 24న జన్మించిన కేజీ జార్జ్.. పొలిటికల్ సైన్స్ లో గ్రాడ్యుయేట్ చేశారు. ఆ తర్వాత పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ఫిల్మ్ డైరెక్టింగ్ చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. కేజీ జార్జ్ మరణం పట్ల మాలీవుడ్ సంతాపం తెలియజేస్తుంది. ఆయన మరణం చిత్ర పరిశ్రమకి తీరని లోటని, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన లెగసీ కంటిన్యూ అవుతుందని, ఎప్పటికీ సినిమాలతో ఆయన గుర్తిండిపోతారని కొనియాడుతూ నివాళ్లు అర్పిస్తున్నారు.