`ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి` సినిమాలో హీరోయిన్‌ మాళవిక నాయర్‌ ముద్దు సీన్‌లో నటించింది. ఇది హాట్‌ టాపిక్‌ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల స్పందించారు.  

నాగశౌర్య, మాళవిక నాయర్‌ జంటగా నటించిన చిత్రం `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి`(ఫాఫా). నటుడు, దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాలు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. ఇటీవల విడుదలైన టీజర్‌లో నాగశౌర్య, మాళవిక మధ్య ఓ రొమాంటిక్‌ ముద్దు సీన్‌ ఉంది. మాళవిక నాయర్‌ ముద్దు సీన్‌ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇది క్రేజ్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రశ్న దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాలకి ఎదురైంది. శనివారం ఆయన మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ముద్దు సీన్‌పై వివరణ ఇచ్చారు. 

ముద్దు సీన్‌ ఉంటుందని మాళవికకి ముందే తెలుసా? ఆమె రియాక్షనేంటి? అనే ప్రశ్నకి శ్రీనివాస్‌ అవసరాల స్పందిస్తూ, తాను కథ చెప్పినప్పుడే సినిమాలో ఏం ఉంటుందో ప్రతిదీ వివరించాను. ఆ ముద్దు సీన్‌ గురించి కూడా ముందే చెప్పానని, ఆమె కథకి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యిందని, దీంతో ముద్దు గురించి కూడా తెలిసే ఒప్పుకుందని చెప్పారు. కథకి అంతగా కనెక్ట్ అవడం వల్లే ఆ సీన్‌ చేసిందన్నారు. ఏ నటులైనా ఆయా సన్నివేశాలకు సరైన కారణాలు ఉంటే, కథకి ఖచ్చితంగా అవసరం అనిపిస్తే చేయడానికి సిద్ధపడతారని తెలిపారు. అదే సమయంలో మాళవికకి ముందుగా మరో హీరోయిన్‌ అనుకున్నది నిజం కాదన్నారు.

సినిమా ప్రారంభించి ఆల్మోస్ట్ ఐదేళ్లు అవుతుంది? ఈ గ్యాప్‌లో కథలో మార్పులు చేశారా? అనే ప్రశ్నకి దర్శకుడు స్పందిస్తూ, కరోనాకి ముందే రాసుకున్న కథ అని, కానీ ఈ కథ ఇంతటి నిడివి అవసరం ఉండిందన్నారు. ఏడు ఛాప్టల్లో సినిమా సాగుతుందని, హీరోని ఏడు ఏజ్‌ గ్రూపుల్లో చూపించాల్సి ఉంటుందని, లక్కీ కరోనా వల్ల డిలీ ఈ సినిమాకి కలిసొచ్చిందని, అది మాకు మంచే జరిగిందన్నారు శ్రీనివాస్‌ అవసరాల. కరోనాకి ముందు ఇండియా పార్ట్ చేశామని, కరోనా తర్వాత యూకే పార్ట్ చేశామన్నారు.

సినిమాకి `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి` టైటిల్ పెట్టడానికి కారణమేంటనే ప్రశ్నకి ఆయన చెబుతూ, `సినిమాలో పాత్రలు, సంభాషణలు సహజంగా ఉంటాయి. నిజంగా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందో అంత సహజంగా ఉండాలని తీసిన సినిమా ఇది. ఈ కథ కూడా నిజ జీవితంలో నేను చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా రాసుకున్నాను. ఇది జనాలకు దగ్గరగా ఉండే కథ. మనకు తెలిసిన కథలా, మనలో ఒకరి కథలా ఉంటుంది. అంత సహజమైన సినిమాకి 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' లాంటి టైటిల్ పెడితే బాగుంటుంది అనిపించింది. మొదట దీనిని వర్కింగ్ అనుకుంటున్నాను అని చెప్పాను. అయితే ఈ టైటిల్ నిర్మాతలకు ఎంతగానో నచ్చి వెంటనే రిజిస్టర్ చేయించారు. 

సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్ తో ప్రయాణం గురించి చెబుతూ, `కళ్యాణ్ మాలిక్ `అష్టాచమ్మా` సినిమా సమయం నుంచే తెలుసు. మా ఇద్దరికీ మంచి అనుబంధం ఉంది. మా ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉంటాయో ఒకరికొకరికి తెలుసు. 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' సినిమాలు సంగీత దర్శకుడిగా ఆయనకు మంచి పేరు తీసుకురావడంతో నేనంటే కొంచెం ఎక్కువ ప్రేమ ఆయనకు. ఆ అనుబంధం వల్లే సినిమా సినిమాకి ఇంకా మంచి అవుట్ పుట్ వస్తుంది. 'కనుల చాటు మేఘమా' పాటను కీరవాణి గారి లాంటి దిగ్గజం సహా అందరూ ప్రశంసించడంతో కళ్యాణ్ మాలిక్ ఎంతో ఆనందంగా ఉన్నారు.

వరుసగా నాగశౌర్యతోనే సినిమాలు చేయడానికి కారణం? పై రియాక్ట్ అవుతూ, నాగశౌర్య నాకు చాలా ఇష్టమైన నటుడు. యూకేలో షూటింగ్ కి పదిమందితోనే వెళ్లడంతో అక్కడ మేం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయితే నాగశౌర్య తన నటనతో ఆ ఇబ్బందులను మర్చిపోయేలా చేసేవాడు. ప్రతిరోజూ అవుట్ పుట్ చూసుకొని సంతృప్తి కలిగేది. ఇది ముఖ్యంగా నటన మీద ఆధారపడిన సినిమా. నాగశౌర్య ఎంత బాగా నటించాడనేది మీకు సినిమా చూశాక తెలుస్తుంది. ఈ పదేళ్లలో 18 నుంచి 28 ఏళ్ళ వరకు నాగశౌర్య, మాళవిక పాత్రల ప్రయాణం ఉంటుంది. వయసుకి తగ్గట్లుగా పాత్ర తాలూకు ప్రవర్తన, ఆహార్యంలో వ్యత్యాసం చూపించడానికి నాగశౌర్య ఎంతో కష్టపడ్డాడు. ఈ సినిమా పట్ల శౌర్య చాలా నమ్మకంగా ఉన్నాడు.

`బ్రహ్మాస్త్ర`, `అవతార్-2` సినిమాలకు తెలుగులో మాటలు రాయడంపై శ్రీనివాస్‌ అవసరాల మాట్లాడుతూ, `ఒకసారి టీమ్ ఫోన్ చేసి `బ్రహ్మాస్త్ర`కు రాస్తారా అని అడిగారు. అప్పటికే ఆ సినిమా గురించి తెలుసు. నాగార్జున కూడా నటిస్తున్నారని, పెద్ద సినిమా, ఎక్కువమంది చేరువయ్యేది కావడంతో వెంటనే రాయడానికి అంగీకరించాను. ఆ సినిమా చూసి నాకు `అవతార్-2` అవకాశం ఇచ్చారు. హిందీ సినిమాలతో పోల్చితే ఇంగ్లీష్ సినిమాలకు తెలుగు సంభాషణలు రాయడం కొంచెం కష్టం. దానిని ఛాలెంజింగ్ గా తీసుకుని అవతార్-2 కి రాశాను. నెక్ట్స్ ఓ కథ సిద్ధంగా ఉంది. అలాగే `కన్యాశుల్కం` వెబ్‌సిరీస్‌ చేశాను. నటన కంటే ఇకపై దర్శకుడిగానే ఫోకస్‌ చేయాలనుకుంటున్నా అని తెలిపారు.

నాగశౌర్య, మాళవిక నాయర్‌ జంటగా, శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వంలో రూపొందిన `ఫలనా అబ్బాయి ఫలానా అమ్మాయి` చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి. ఈ చిత్రం ఈ నెల(మార్చి) 17న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, 'కనుల చాటు మేఘమా' పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని అంచనాలను రెట్టింపు చేశాయి.