ప్రభాస్‌ హీరోగా రూపొందబోతున్న `ఆదిపురుష్‌`పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కూడా భారీ స్థాయిలో ఉంటుందని ప్రచారం జరిగింది. తాజాగా దీన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. ఓ న్యాయవాది సినిమాపై, సైఫ్‌ అలీఖాన్‌పై కోర్ట్ లో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది. మరి ఆ న్యాయవాది ఎవరు, ఎందుకు పిటిషన్‌ దాఖలు చేశారనేది చూస్తే.. 

ఇటీవల బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడి విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. `రాముడితో రావణుడు యుద్ధం చేయడం కరెక్టే. రావణుడిలో ఉన్న మానవత్వ కోణాన్ని `ఆదిపురుష్‌`లో చూపించబోతున్నాం` అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అనేక విమర్శలు రావడంతో ఎట్టకేలకు సైఫ్‌ స్పందించారు. క్షమాపణలు చెప్పారు. 

కానీ ఉత్తరప్రదేశ్‌కి చెందిన హిమాన్షు శ్రీవాస్తవ అనే న్యాయవాది మాత్రం ఈ వ్యాఖ్యలను చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. ఆయన `ఆదిపురుష్‌` సినిమాపై, సైఫ్‌ అలీఖాన్‌పై జౌన్‌పూర్‌ కోర్ట్ లో పిటిషన్‌ దాఖలు చేశారు. సైఫ్‌ చేసిన వ్యాఖ్యలు మత విశ్వాసాన్ని, మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. సైఫ్‌తోపాటు చిత్ర దర్శకుడు ఓం రౌత్‌ పేరుని కూడా పిటిషన్‌లో పేర్కొన్నాడు. 

ప్రభాస్‌ హీరోగా రూపొందబోతున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ రాముడిగా, సైఫ్‌ రావణుడిగా కనిపించనున్నారట. కృతి సనన్‌ సీత పాత్రలో నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఓం రౌత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతోపాటు భూషణ్‌ కుమార్‌, క్రిషన్‌ కుమార్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేష్‌ నాయర్‌ లతో కలిసి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమాని ప్రారంభించి 2022 ఆగస్ట్ 11న సినిమాని విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. దీన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కించనున్నారు.