అబ్బాయి రామ్‌చరణ్‌కి బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌ అభినందనలు తెలిపారు. తాజాగా `ఆర్‌ఆర్‌ఆర్‌`, రామ్‌ చరణ్‌ `హాలీవుడ్‌ క్రిటిక్స్ అసోసియేషన్‌` అవార్డులను అందుకున్న నేపథ్యంలో పవన్‌ స్పందించారు.

అబ్బాయి రామ్‌చరణ్‌కి అభినందనలు తెలిపారు బాబాయ్‌, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌. `హాలీవుడ్‌ క్రిటిక్స్ అసోసియేషన్స్` అవార్డులు అందుకున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రానికిగానూ, అందులో స్పాట్‌ లైట్‌ అవార్డుని సొంతం చేసుకున్న రామ్‌చరణ్‌ని అభినందించారు పవన్‌. ఈ మేరకు పవన్‌ కళ్యాణ్‌ తన జనసేన పార్టీ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. 

`ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో 'ఆర్.ఆర్.ఆర్' పలు పురస్కారాలు దక్కించుకోవడం ఆనందదాయకం. ఈ వేదికపై ‘బెస్ట్ వాయిస్/మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్’ ను రామ్ చరణ్ ద్వారా ప్రకటింపచేయడం, స్పాట్ లైట్ అవార్డు స్వీకరించడం సంతోషాన్ని కలిగించింది. రామ్ చరణ్ కీ, దర్శకులు రాజమౌళికి, చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. చరణ్‌ మరిన్ని మంచి చిత్రాలు చేసి అందరి మన్ననలు పొంది ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా` అని తెలిపారు పవన్‌.

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా ఇండియన్‌ సినిమా గొప్పతనాన్ని అంతర్జాతీయంగా చాటుతుంది. ఇప్పటికే అనేక ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. `నాటు నాటు` పాటకి పలు అవార్డులు వరించాయి. ఏకంగా `ఆస్కార్‌`కి నామినేట్‌ అయ్యింది. దీనికితోడు తాజాగా ఐదు విభాగాల్లో హాలీవుడ్‌ క్రిటిక్స్ అసోసియేషన్‌ అవార్డులను అందుకుంది. ఇందులో భాగంగానే రామ్‌చరణ్‌కి స్పాట్‌లైట్‌ అవార్డు వరించింది. అంతేకాదు అంతర్జాతీయ వేదికపై, అది కూడా హాలీవుడ్‌ వేదికపై వారికి అవార్డు అందించే అరుదైన గౌరవం రామ్‌చరణ్‌కి దక్కడం విశేషం. 

ఓ వైపు అవార్డులు, ప్రశంసలు దక్కుతుండగా, ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక అవార్డు కోసం రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ పోటీ పడుతున్నారు. అది కూడా హాలీవుడ్‌ దిగ్గజాలతో పోటీ పడుతుండటం విశేషం. యాక్షన్‌ మూవీ విభాగంలో ఈ ఇద్దరు `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రానికిగానూ నామినేట్‌ కావడం మరో విశేషం. హాలీవుడ్‌ దిగ్గజ నటులైన టామ్‌ క్యూజ్‌, బ్రాడ్‌ పిట్‌, నికోలస్‌ కేజ్‌లతో కలిసి వీరు క్రిటిక్‌ ఛాయిస్‌ అవార్డుల కోసం పోటీ పడుతున్నారు. 

`యాక్షన్‌ మూవీస్‌లో ఉత్తమ నటుడిగా నా సోదరుడు ఎన్టీఆర్‌తోపాటు నా పేరు నామినేట్‌ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. అంతేకాదు నికోలస్‌ కేజ్‌, టామ్‌ క్రూజ్‌, బ్రాడ్‌ పిట్‌ వంటి దిగ్గజాల పక్కన మన పేర్లని చూడటం ఎంతో అద్భుతమైన అనుభూతి` అని పేర్కొన్నారు రామ్‌చరణ్‌. మార్చి 16న ఈ అవార్డులను ప్రకటించనున్నారు. 

మరోవైపు హాలీవుడ్‌ క్రిటిక్స్ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) అవార్డులపై చరణ్‌ స్పందిస్తూ, `హెచ్‌సీఏ 2023లో రాజమౌళి, కీరవాణిలతో కలిసి భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం వహించినందుకుంద చాలా గౌరవంగా ఉంది. `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌గా మాకు లభించిన గుర్తింపు పట్ల నేను గర్విస్తున్నా` అని పేర్కొన్నారు చరణ్‌. అలాగే తనని అవార్డు ప్రజెంటర్‌గా ఆహ్వానించిన నటి ఏంజెలీ బస్సెట్‌కి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాడు చరణ్‌. అంతేకాదు త్వరలో కలిసి సెల్ఫీ తీసుకుందామని వెల్లడించారు చరణ్‌.